'టాకింగ్ హ్యాండ్స్': ఇక్కడ చేతులతో తప్ప మాటలతో పని లేదు

హైదరాబాద్: ఆ రెస్టారెంట్లో సైగలతోనే ఆర్డర్ చేయాలి

Last Updated : Oct 9, 2018, 10:03 PM IST
'టాకింగ్ హ్యాండ్స్': ఇక్కడ చేతులతో తప్ప మాటలతో పని లేదు

హైదరాబాద్ మహానగరంలో మీరెన్నో రెస్టారెంట్‌లను చూసి ఉంటారు. కానీ ఈ రెస్టారెంట్ ప్రత్యేకమైంది. ఈ రెస్టారెంట్ పేరు 'టాకింగ్‌ హ్యాండ్స్'‌. అవును.. అక్కడ చేతులే మాట్లాడుతాయి. ఇక్కడ అందరూ సైగలతోనే మాట్లాడుతారు. ఎందుకంటే ఇక్కడ పనిచేసే సిబ్బంది, దీనిని నడిపే యాజమాన్యం అందరూ కూడా బధిరులే. బహుశా దేశంలో ఈ విధమైన రెస్టారెంట్ మరెక్కడా ఉండదేమో..

టాకింగ్‌ హ్యాండ్స్‌.. మూగ, చెవిటి సిబ్బందితో నడుస్తున్న రెస్టారెంట్‌. క్యాషియర్, వెయిటర్, మేనేజర్ ఇలా మొత్తం 25 మంది సిబ్బందితో నడుస్తున్న ఈ రెస్టారెంట్ హైదరాబాద్‌లో బేంగంపేటలోని పర్యటన భవన్, గ్రీన్ ల్యాండ్స్‌లో ఉంది. గత సంవత్సరంలో ప్రారంభమైన టాకింగ్‌ హ్యాండ్స్‌ను తెలంగాణ టూరిజం శాఖ సహకారంతో డెఫ్‌ ఎనబుల్డ్‌ ఫౌండేషన్‌(డీఈఎఫ్‌) సీఈఓ టి.కె.ఎం.సందీప్‌ నెలకొల్పారు.

టాకింగ్ హ్యాండ్ అంటే చేతులతో సైగలు చేస్తూ కమ్యూనికేట్ అవ్వడం అని అర్థం. బధిరులకు ఉపాధి కల్పించాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్లు వింధ్యా వీ ఇన్ఫో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ సతీశ్ తెలిపారు.

'టేబుల్‌ వద్దకు వెళ్లి కూర్చోగానే రెస్టారెంట్ సిబ్బంది వచ్చి సైగలతో ఆర్డర్‌ అడుగుతారు. టేబుల్ మీద ఉన్న పాంప్లెట్‌‌లో మీకు కావాల్సిన ఆహారం గుర్తు చూపిస్తే ఆర్డర్ తీసుకుంటారు. అంతేకాదు అక్కడ ఉన్న స్ర్కీన్స్‌పై కస్టమర్ల కోసం సంకేతాలు కనిపిస్తాయి. వాటి ఆధారంగా కూడా వారితో మాట్లాడొచ్చు. శాఖాహారం, మాంసాహారం లభిస్తాయి. మధ్యలో వెయిటర్‌ను పిలవాలంటే టేబుల్‌పై ఉన్న బల్బ్‌ను నొక్కితే చాలు. వెంటనే వాళ్లు వచ్చి సర్వ్‌ చేస్తారు.' అని యాజమాన్యం పేర్కొంది. రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది పిల్లల స్కూల్ ఫీజులు కూడా తమ సంస్థే కడుతుందని యాజమాన్యం తెలిపింది.

'ఇంతకు ముందు ఉద్యోగం లేక నేను ఇంట్లో ఉండేవాడిని. ఈ సంస్థలో చేరాక నా జీవితం మారిపోయింది. ఏడేళ్ల క్రితం నేను ఈ సంస్థలో ఏజెంట్‌గా చేరాను. ప్రస్తుతం నేను టీమ్ లీడర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ పని చాలా బాగుంది' అని వెంకట్ అనే ఉద్యోగి ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

'దేశ, విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు టాకింగ్‌ హ్యాండ్స్‌ని సందర్శిస్తుంటారు. ఇక్కడ భోజనం తిన్న వారందరూ బాగుంటుందని కితాబిస్తుంటారు' అని రెస్టారెంట్‌ నిర్వాహకులు తెలిపారు.

 

Trending News