భావనా అగ్ని ప్రమాదం.. రాజకీయ వివాదాల పుట్ట..!

ఢిల్లీలోని  భావన ఇండస్ట్రీ ఏరియాలో శనివారం క్రాకర్స్ ఫ్యా్క్టరీలో సంభవించిన అగ్నిప్రమాదంలో 17 మంది అమాయకులు అగ్నికి ఆహుతి అవ్వడం గమనార్హం. 

Last Updated : Jan 21, 2018, 03:04 PM IST
భావనా అగ్ని ప్రమాదం.. రాజకీయ వివాదాల పుట్ట..!

ఢిల్లీలోని  భావన ఇండస్ట్రీ ఏరియాలో శనివారం క్రాకర్స్ ఫ్యాక్టరీలో సంభవించిన అగ్నిప్రమాదంలో 17 మంది అమాయకులు అగ్నికి ఆహుతి అవ్వడం గమనార్హం. ఇప్పటికే ఆ ఫ్యాక్టరీ యజమాని మనోజ్ జైన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులు పనిలో ఉన్నారు. కనుక బేస్‌మెంట్ నుండి మంటలు పై రెండు ఫ్లోర్లకు పాకినప్పుడు వారు పరిస్థితిని అంచనా వేయడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. కొందరు బిల్డింగ్ నుండి కూడా దూకేశారు.

ఈ అగ్ని ప్రమాదం వార్త అందగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. చనిపోయిన బాధితులకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే ఇదే ఘటన ఇప్పుడు అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఘటనా స్థలానికి వచ్చిన నార్త్ ఢిల్లీ మేయర్ అధికారులతో మాట్లాడుతూ "ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ మన వద్ద ఉంది. కాబట్టి ఏమీ మాట్లాడవద్దు" అనడంతో ఆ మాటలు రికార్డు చేసిన పలువురు మీడియా వ్యక్తులు వాటిని లీక్ చేశారు. దాంతో పరిస్థితి వివాదంగా మారింది.

ఈ క్రమంలో ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఆ ఫ్యాక్టరీకి మంజూరు చేసింది కేవలం ప్లాస్టిక్ వస్తువులు అమ్మడానికి మాత్రమే అని.. కాని వారు లోపల మందుగుండు సామగ్రిని ప్యాకింగ్చేయిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే ఈ వార్తలు వచ్చాయో ఆప్ ప్రభుత్వానికి, బిజేపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు ప్రభుత్వాలు ఒకదాన్ని ఒకటి విమర్శించుకోవడం ప్రారంభించాయి. మేయర్ చెప్పిన మాటలను బట్టి బీజేపీ ప్రభుత్వమే ఈ ఘటనకు బాధ్యత తీసుకోవాలని ఓ ఆప్ ప్రతినిధి డిమాండ్ చేయగా.. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ నకిలీ వార్తలు ప్రచారం చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో దూరం వెళ్తుందో మాత్రం తెలియడం లేదు

 

Trending News