భారతదేశంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో పాటు ఆయన భార్య, సోదరుడిపై కూడా సీబీఐ ఛీటింగ్ కేసును నమోదు చేసింది. 2017లో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించిన కొందరు అధికారులతో కలిసి రూ.280.70 కోట్ల రూపాయల వరకు మోదీ బ్యాంకు సొమ్ము కొల్లగొట్టినట్లు సమాచారం అందడంతో ఈ కేసును నమోదు చేశారు.
దీని వల్ల బ్యాంకుకి ఎనలేని నష్టం జరిగిందని ఫిర్యాదు అందడంతో ఈ కేసును నమోదు చేశారు సీబీఐ అధికారులు. నీరవ్ మోదీకి సంబంధించిన డైమండ్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు అక్రమ మార్గాన బ్యాంకు నిధులను కొల్లగొట్టిన్నట్లు సీబీఐ అధికారులు తెలుపుతున్నారు. తప్పుడు ధ్రువపత్రాలు అందించడంతో పాటు బ్యాంకును పక్కదోవ పట్టించేలా రికార్డులను తారుమారు చేయడం మొదలైన కేసులను నీరవ్ మోదీపై ప్రస్తుతం అధికారులు బనాయించారు.
బెల్జియంలో పుట్టి పెరిగిన నీరవ్ మోదీ డిజైనింగ్ రంగంలో అనేక సంవత్సరాలు పనిచేశారు. 1999లో భారత్లో ఫైర్ స్టార్ పేరుతో డైమండ్ ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం నీరవ్ మోదీకి సంబంధించిన డైమండ్ షాపులు భారత్తో పాటు న్యూయార్క్, హాంగ్కాంగ్, లండన్, మకావ్ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. 2013లో తొలిసారిగా నీరవ్ మోదీ ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ బిలయనీర్స్లో స్థానం సంపాదించుకున్నారు. కేట్ విన్స్లెట్, లిసా హేడన్ వంటి హాలీవుడ్ నటీమణులు కూడా నీరవ్ బ్రాండ్ డైమండ్స్ అంటే ఇష్టపడతారని పలు పత్రికలు గతంతో తెలపడం గమనార్హం.