హై అలర్ట్: పెను తుఫానుగా మారిన వాయుగుండం

హైఅలర్ట్: పెను తుఫానుగా మారిన వాయుగుండం

Last Updated : Oct 8, 2018, 08:47 AM IST
హై అలర్ట్: పెను తుఫానుగా మారిన వాయుగుండం

అరేబియా సముద్రంలో బలపడిన వాయుగుండం పెను తుఫానుగా మారి దక్షిణాది రాష్ట్రాలపై విరుచుకుపడనుందని భారత వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు.  దక్షిణ కర్నాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగిసిపడతాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు దూరంగా వెళ్లొద్దని సూచించింది.

రానున్న 24 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరిలోలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని, చెన్నై పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని  ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ, కోస్ట్‌గార్డ్స్‌ బృందాలను అక్కడి ప్రభుత్వాలు సిద్ధం చేశాయి.

అటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రాగల 36 గంటల్లో తుఫానుగా విరుచుకుపడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణం పేర్కొంది.

హైదరాబాద్‌కు వర్ష సూచన

ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల 48గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయంది.

 

Trending News