ఐస్‌ను చూసి అస్తిపంజరాలని అనుకున్నారు

కోల్‌కతాలో ఓ చిత్రమైన ఘటన చోటు చేసుకుంది.

Last Updated : Sep 2, 2018, 09:18 PM IST
ఐస్‌ను చూసి అస్తిపంజరాలని అనుకున్నారు

కోల్‌కతాలో ఓ చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. హరిదేవపుర ప్రాంతంలో ప్లాస్టిక్ బ్యాగుల్లో చుట్టిన 14 మంది పసిపిల్లల అస్థిపంజరాలను ఓ ఖాళీ ప్లాటులో గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన ఆ ప్లాటు గతకొంత కాలంగా ఖాళీగా ఉంది. ఇటీవలే ప్లాటును శుభ్రం చేయడానికి కూలీలను తీసుకువెళ్లగా.. వారికి ప్లాటులో ఓ చోట ప్లాస్టిక్ కవర్లు కనిపించాయి. ఆ కవర్లను విప్పి చూడగా.. వారికి నెలలు కూడా నిండని పసిపిల్లల కళేబరాలు కనిపించాయని.. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారని తెలిపారు.

సమాచారం అందగానే హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసిపిల్లల కళేబరాల మాదిరిగా కనిపిస్తున్నవాటిని స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గతంలో కోల్‌కతాలో విచ్చలవిడిగా అబార్షన్లు జరిగిన సంఘటనలు వెలుగుచూశాయి. ఆ క్రమంలో చట్టవ్యతిరేకంగా అబార్షన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుత కేసుకు ఆ ముఠాలకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఈ అస్థిపంజరాలకు సంబంధించిన సమాచారం అందగానే సిటీ మేయర్ సౌవన్ ఛటర్జీతో పాటు పోలీస్ కమీషనర్ రాజీవ్ కపూర్ సంఘటన స్థలానికి చేరుకొని ప్లాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా క్లూస్ టీమ్ సహాయం తీసుకొని ఆధారాలు సేకరించమని స్థానిక పోలీసులను ఆదేశించారు. అయితే ఘటనా స్థలిలో దొరికిన వాటిని పరిశీలించిన వైద్యులు.. అవి అస్తిపంజరాలు కావని.. చెత్తా చెదారంతో కూడిన డ్రై ఐస్ ఆఖరికి ఆ రూపాన్ని సంతరించుకుందని తెలపగానే విస్తుపోవడం అందరివంతైంది. 

 

Trending News