పాట్నాలో కూరగాయల మార్కెట్‌లో తమకు సరకులు ఉచితంగా ఇవ్వలేదని అక్కసు పెంచుకున్న పలువురు పోలీసులు.. కూరగాయల వ్యాపారి కుమారుడిని జైల్లో పెట్టారు. 14 ఏళ్ల బాలుడిని 18 సంవత్సరాల వయసు గల యువకుడిగా రికార్డులో చూపిస్తూ.. బైక్ దొంగతనం కేసు బనాయించి జైల్లో పెట్టారు. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎంక్వయరీ చేయాల్సిందిగా కమీషనరుని ఆదేశించారు.
ఈ మధ్యకాలంలో బీహార్ పోలీసులు చాలామంది లంచగొండితనానికి అలవాటు పడడంతో పాటు లిక్కర్ మాఫియాలో భాగస్వాములవ్వడంతో వారిని కట్టడి చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా తయారవుతోంది. నాలుగు సంవత్సరాల క్రితం అవినీతికి పాల్పడిన 250 మంది పోలీసులను ముఖ్యమంత్రే స్వయంగా డిస్మిస్ చేశారు.
తాజాగా జరిగిన ఘటనలో కూడా లంచానికి అలవాటు పడిన పోలీసులు బాలుడిని కావాలనే జైల్లో పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఆ బాలుడిని తీవ్రంగా కొట్టి.. తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని తన తండ్రి సీఎంకి ఉత్తరం ద్వారా ఫిర్యాదు చేశారు. మార్చి 20వ తేదిన తన కుమారుడిని అరెస్టు చేసిన పోలీసులు.. ఏ నేరం మీద అరెస్టు చేశారో కనీసం చెప్పలేదని.. కనీసం తనను చూడడానికి కూడా అనుమతించలేదని తెలిపారు.
ఆ తర్వాత పదే పదే పోలీస్ స్టేషనుకి వెళ్లి తన కుమారుడిని చూపించమని కోరగా... కొద్దిసేపు మాట్లాడడానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలోనే తన కొడుకుని కొట్టినట్లు.. సంతకాలు పెట్టించుకున్నట్లు తెలిసిందని బాలుడి తండ్రి వాపోయారు.
ఫ్రీగా కూరగాయలు ఇవ్వలేదని..జైల్లో పెట్టారు