మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం ఆ రైల్వే స్టేషన్. ఆ స్టేషన్లో పనిచేసే వారందరూ మహిళలే. ఈ స్టేషన్లో గల అన్న విభాగాల్లోనూ వారే పనిచేస్తుండటం విశేషం. ముంబైలోని 'మటుంగా రైల్వే స్టేషన్' అత్యధిక మహిళా ఉద్యోగులు గల స్టేషన్‌గా ఇటీవలే రికార్డులకెక్కింది.
దేశంలో పూర్తిగా మహిళలతో నిర్వహిస్తున్న ఏకైక, తొలి రైల్వే స్టేషన్‌గా 'మటుంగా' ఘనత సాధించింది. మహిళా సాధికారతకు నిదర్శనంగా కనిపిస్తున్న ఈ రైల్వే స్టేషన్లో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 41 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్టేషన్ మేనేజర్ నుండి టికెట్ కలెక్టర్లు, జీఆర్పీ పోలీసుల వరకు అందరూ మహిళలే ఉంటారు ఇక్కడ. ఇటీవలే ఈ స్టేషన్ లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
ఓ స్టేషన్లో ఇంతమంది మహిళలు ఉద్యోగాలు చేయడం, స్టేషన్ మొత్తం మహిళల ఆధీనంలో ఉండటం భారతీయ రైల్వేలో ఇదే తొలిసారి. ఇటువంటి రైల్వే స్టేషన్ దేశంలో మరెక్కడా లేదు. ఈ స్టేషనులో మహిళలను నియమించిన ఆరునెలల్లోనే లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం ఆనందంగా ఉందని సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ డీకే శర్మ ఆనందం వ్యక్తం చేశారు.