'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో రెండు నెలల పాటు రైల్వే సర్వీసులు ఆగిపోయాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 37 వేల ప్రయాణీకుల రైళ్లు లూప్ లైన్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడిప్పుడే రైల్వే సర్వీసులు పునఃప్రారంభిస్తున్నారు.
తొలుత 15 నగరాలకు రైల్వే సర్వీసులు ప్రారంభమయ్యాయి. మరిన్ని ఆంక్షలు తొలగిస్తూ కాస్త ఎక్కువగా రైల్వే సర్వీసులు నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో జూన్ 1 నుంచి మరో 73 ప్రయాణీకుల రైళ్లు... ప్రయాణీకుల కోసం అందుబాటులోకి రానున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఐతే రికార్డుస్థాయిలో టికెట్ల బుకింగ్ జరుగుతోంది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 73 రైళ్ల టికెట్ల కోసం ప్రయాణీకులు ఎగబడుతున్నారు. ఇప్పటికే లక్షా 49 వేల 25 టికెట్లను 2 లక్షల 90 వేల 510 ప్రయాణీకుల కోసం విక్రయించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు ఇవాళ ప్రారంభమైన టికెట్ బుకింగ్‌లో కేవలం రెండున్నర గంటల్లోనే రెండో తరగతి టికెట్లు రికార్డుస్థాయిలో అమ్ముడయ్యాయి. ఇప్పటికే 4 లక్షల సెకండ్ క్లాస్ టికెట్లు విక్రయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారు, పట్టణాల్లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లేవారు టికెట్లు బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. మొత్తంగా దాదాపు 2 నెలల విరామం తర్వాత రైల్వే శాఖకు ఇది శుభపరిణామని చెప్పారు.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ బుకింగ్ జరుగుతోంది. ఐతే రేపటి (శుక్రవారం) నుంచి దేశవ్యాప్తంగా లక్షా 70 వేల సర్వీసు సెంటర్లలో టికెట్ల విక్రయం ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలోనూ రెండు, మూడు రోజుల తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభిస్తామన్నారు. ఇందుకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని పీయూష్ గోయెల్ వెల్లడించారు..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
రికార్డుస్థాయిలో రైల్వే టికెట్ల విక్రయం..!!