బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ రోజు కూడా జైల్లోనే గడపనున్నాడు. ఆయన తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటీషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇదే పిటీషనుపై వాదనలు విన్నాక జడ్జి.. శనివారం తీర్పు చెబుతారు.
కాగా, సల్మాన్ బెయిల్ పిటీషనుకు సంబంధించి వాదించవద్దని తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని సల్మాన్ న్యాయవాది మహేష్ బోరా తెలిపారు. నిన్న జోధపూర్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, 2 నల్లజింకలను వేటాడి చంపినందుకు సల్మాన్‌కి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు.
20 సంవత్సరాల నుండీ నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు ఒక్క కొలిక్కి వచ్చినందుకు జీవకారుణ్య సంఘాలు హర్షం ప్రకటించాయి. గురువారం కోర్టు తీర్పు ప్రకటించాక.. సల్మాన్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.ప్రస్తుతం సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఓ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఇదే జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు పక్క సెల్లోనే సల్మాన్ ఖాన్ ఉండడం గమనార్హం.