నేడు ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. రైతు సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను సమావేశంలో వివరించారు. ప్రసంగం ఆరంభించడానికి ముందుగా తమని ఈ సమావేశానికి ఆహ్వానిందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలంగాణలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లడుతూ ''తెలంగాణలో 98శాతం మంది సన్న, చిన్నకారు రైతులున్నారు అని గణాంకాలతో సహా తెలిపారు. వారిని ఆదుకునేందుకు రైతుబంధు పథకం పేరిట ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4వేల చొప్పున పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రైతు బంధు పథకం కారణంగా రైతులకు అందే రుణాలు కానీ లేదా వ్యవసాయోత్పత్తుల ధరలు, మద్ధతు ధరలపై ఎటువంటి ప్రభావం ఉండకుండా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోంది'' అని అన్నారు.
రైతు బీమా యోజన పథకం ద్వారా 18 నుంచి 60ఏళ్ల లోపు మధ్య వయస్సున్న రైతులకు రూ.5లక్షల బీమా కల్పించం జరిగింది. రైతు బీమాకు చెల్లించాల్సిన ప్రీమియంను సైతం ప్రభుత్వమే భరించనుంది. ఆగస్టు 15 నుంచి 50 లక్షల మంది రైతులకు బీమా కల్పించబోతున్నాం. బీమా ప్రీమియంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం పడుతుంది. అయినప్పటికీ రైతుల ఆర్థిక పరిస్థితులు, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరిస్తున్నట్టు కేసీఆర్ వివరించారు.
ఇటీవలే తెలంగాణ సర్కార్ చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనను సైతం కేసీఆర్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. దశాబ్ధాల తరబడి జరుగుతున్న అవకతవకలు, అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సరిచేసి, రికార్డుల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకోచ్చే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా పాస్ పుస్తకాల జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా 17 రకాల సెక్యూరిటీ ఫీచర్లతో ఉన్న 50లక్షల పట్టాదార్ పాస్ పుస్తకాలను హక్కుదారులకు అందజేశామన్నారు.