త్రిపురలో నేడే ఎన్నికలు.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం!

త్రిపురలో నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తగిన విధంగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది.

Last Updated : Feb 18, 2018, 06:34 PM IST
త్రిపురలో నేడే ఎన్నికలు.. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం!

త్రిపురలో నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం తగిన విధంగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో గెలిచి, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా త్రిపురకు సేవలు అందించిన మాణిక్ సర్కార్‌ని గద్దె దించి త్రిపురలో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోన్న బీజేపీ అందుకు తీవ్రంగానే కృషిచేస్తోంది. మరోవైపు బీజేపీ చేతికి రాష్ట్ర అధికార పగ్గాలు చిక్కకుండా వుండేందుకు సీపీఎం నేతలు, సీఎం మాణిక్ సర్కార్‌తో కలిసి పోరాడుతున్నారు.

వచ్చే ఏడాది త్రిపురలోనూ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వచ్చే ఏడాదికి త్రిపుర ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. దీంతో త్రిపుర ఎన్నికలు బీజేపీకి కచ్చితంగా ఓ సవాలు లాంటివేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

త్రిపురలో మాణిక్‌ సర్కార్‌ గత 20 ఏళ్లుగా తిరుగులేని ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో వున్న ప్రధాని నరేంద్ర మోడీకి, త్రిపురలో అధికారంలో వున్న సీపీఎం నేత మాణిక్ సర్కార్‌కి మధ్య జరుగుతున్న ఎన్నికల సమరంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఇద్దరిలో విజయం ఎవరిని వరించనుందనేది మార్చి 3న జరిగే ఓట్ల లెక్కింపు ఫలితాలు తేల్చనున్నాయి.

ఇదిలావుంటే, నేడు త్రిపురలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను భారీ స్థాయిలో మొహరించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని ఓ కంట కనిపెడుతోంది.

 

Trending News