Wrong UPI Payments Solution: పొరపాటున ఒకరికి చేయాల్సిన యూపీఐ చెల్లింపును మరొకరికి చేశారా ? అరెరె.. తప్పు జరిగిపోయింది ఇప్పుడెలా అని కంగారు పడుతున్నారా ? టెన్షన్ పడకండి.. మీకే కాదు.. చాలామందికి ఇలాంటి రాంగ్ యూపీఐ పేమెంట్స్ జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా రాంగ్ యూపీఐ పేమెంట్ తో కోల్పోయిన డబ్బును తిరిగి సొంతం చేసుకునేందుకు ఓ మార్గం ఉంది. అదేంటో తెలుసుకుందాం రండి.
యూపీఐ యాప్ లో సపోర్ట్ అనే బటన్ పై క్లిక్ చేసి వెంటనే మీ సమస్యను రిపోర్ట్ చేయండి.
ఎప్పుడైనా హడావుడిలో ఉండటం వల్ల రాంగ్ పేమెంట్ చేసినట్టయితే.. ముందుగా మీరు ఉపయోగించిన యూపీఐ యాప్ ఏదైతే ఉందో.. ఆ యాప్ కస్టమర్ కేర్ సపోర్ట్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు గూగుల్ పే ఉపయోగించినట్టయితే గూగుల్ పే కస్టమర్ కేర్‌కి.. లేదంటే ఫోన్‌పే ఉపయోగించినట్టయితే ఫోన్ పే యాప్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి రిపోర్ట్ చేయండి.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI ) అధికారిక పోర్టల్‌లో ఇలా ఫిర్యాదు చేయండి
మీరు చెల్లింపులు చేసిన యూపీఐ పేమెంట్ యాప్ కస్టమర్ కేర్ నుంచి మీకు సరైన స్పందన లభించకపోతే.. మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోర్టల్‌ని విజిట్ చేసి మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు.
మీ ఫిర్యాదును నమోదు చేయడం ఎలాగంటే..
ముందుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక పోర్టల్‌కి వెళ్లండి.
అక్కడ మీకు కనిపించే " What we do tab " అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
ఆ తరువాత కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే యూపీఐపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
అప్పుడు డిస్ప్యూట్ రిడ్రెస్సల్ మెకానిజం అనే బటన్ పై క్లిక్ చేయండి.
అక్కడ కనిపించే కంప్లెయింట్స్ సెక్షన్ కింద మీ పేమెంట్స్ కి సంబంధించిన వివరాలు నమోదు చేయండి.
చివర్లో Incorrectly transferred to another account అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీ కంప్లెయింట్‌ని సబ్మిట్ చేయండి.
ఏ బ్యాంక్ ఖాతా నుంచి అయితే మీ డబ్బులు కట్ అయ్యాయో.. ఆ బ్యాంకును సంప్రదించండి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే, మీరు పంపించిన డబ్బు ఏ బ్యాంక్ ఖాతాలోనైతే బదిలీ అవుతుందో.. ఆ బ్యాంకులోనూ మీ ఫిర్యాదును ఇవ్వవచ్చు. PSP/TPAP యాప్‌పై సైతం మీరు ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే, మీరు నేరుగా బ్యాంకుకే వెళ్లి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
ఆర్బీఐలో కూడా మీరు ఫిర్యాదు చేయొచ్చు
రాంగ్ యూపీఐ పేమెంట్స్‌ని ఆర్బీఐకి మూడు రకాలుగా ఫిర్యాదు చేయొచ్చు.
ఆర్బీఐకి మీరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.
మీ ఫిర్యాదును ఆర్బీఐ కంప్లెయింట్స్ నిర్వహించే CMS లో కూడా సబ్మిట్ చేయొచ్చు.
నేరుగా ఆర్బీఐకి సంబంధించిన కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
ఇవన్నీ కూడా రాంగ్ యూపీఐ పేమెంట్స్ విషయంలో యూపీఐ వినియోగదారులకు ఉపయోగపడే పరిష్కారమార్గాలు.