YS Vivekananda Reddy's Murder Case: రాజమండ్రి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ని ఉటంకిస్తూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు. ‘‘హత్యకు సంబంధించి సీబీఐ అఫిడవిట్లో అన్ని వాస్తవాలను వెల్లడించింది. వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత, ఆ హత్యలో పాల్గొన్న వ్యక్తులు చాలా అమాయకులుగా నటించారు. వాళ్లంతా దాదాపు ప్రతీ రోజు హత్యపై తమ పంథాను మార్చుకుంటూ వెళ్లారు" అని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం జరిగిన మహానాడు కార్యక్రమంలో కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకా హత్య గురించి ఇతరులకు తెలియక ముందే జగన్కు తెలిసిందని సీబీఐ తమ అఫిడవిట్ లో పేర్కొన్న అంశాలను మీడియా వద్ద ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు.. అసలు నేరాన్ని తప్పుదోవపట్టించడానికే నానా ప్రయత్నాలు చేశారు అని ఆరోపించారు. అందులో భాగంగానే నారాసుర రక్త చరిత్ర' పుస్తకాన్ని కూడా రాశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పాత్రికేయులతో మాట్లాడుతూ.. హంతకుడిని లేదా హత్యల వెనుక ఉన్న వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఈ తరం భవిష్యత్తు ఏమిటని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీబీఐ అఫిడవిట్ తో బయటపడ్డ వాస్తవాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులు హత్యకు ముందు, హత్య తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనే తలదాచుకున్నారని.. ఎప్పటికప్పుడు ఏం జరిగింది అనే విషయంలో ప్రతి నిమిషం ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్కు వివరించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం తలెత్తిన అనుమానాలతో పాటు తాజా సీబీఐ చేసిన ఆరోపణలపై సైతం ఏపీ సీఎం జగన్ స్పందించి పూర్తి వివరణ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఈ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.