అమెరికా నుండి 24 యాంటీ సబ్ మెరైన్ హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి భారత్ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు అమెరికాకి భారత్ లేఖ కూడా రాసింది. ఈ క్రమంలో దాదాపు 2 బిలియన్ డాలర్లతో ఒప్పందం కూడా చేసుకోనున్నట్లు భారతరక్షణ శాఖ తెలిపింది. మరో రెండు మూడు నెలల్లో ఈ ఒప్పందం జరిగే అవకాశం ఉందని శాఖ తెలిపింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఇటీవలే సింగపూర్ రీజనల్ సమ్మిట్‌లో నరేంద్ర మోదీని కలిసి మాట్లాడారని.. అప్పుడే ఈ ఒప్పందం వివరాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది.
ఈ ఒప్పందానికి సంబంధించి భారత్, అమెరికాకి ఉత్తరం కూడా రాయనుంది. ప్రస్తుతం లాక్ హీడ్ మార్టిన్ సంస్థ తయారుచేస్తున్న ఎంహెచ్ 60ఆర్ సీహ్యాక్ హెలికాప్టర్ ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ మెరీటైమ్ హెలికాప్టర్‌గా పేరుగాంచింది. ఒకవేళ భారత్, అమెరికా దేశాల మధ్య ఒప్పందం కుదిరితే.. ఈ విమానాలను భారతదేశానికి కూడా కంపెనీ సప్లై చేసే అవకాశం ఉంది. అలాగే అమెరికా, భారత్‌ల మధ్య జరిగిన డిఫెన్స్ ట్రేడ్ కూడా 20 బిలియన్ డాలర్లు క్రాస్ చేసే అవకాశం ఉంది.
జలాంతర్గాములను,యుద్ధనౌకలను ధ్వంసం చేసే సత్తా ఈ అధునాతన హెలికాప్టర్లకు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ హెలికాప్టర్లును కొనుగోలు చేయడానికి భారత్ దాదాపు పదేళ్ళ నుండి ప్రణాళికలు వేయడం గమనార్హం. సముద్ర సరిహద్దు ప్రాంతాలలో చైనా నుండి భారత్‌కు ముప్పు ఉన్నందున.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నావికాదళానికి ఇలాంటి హెలికాప్టర్లు ఇప్పటి వరకూ సేవలు అందిస్తున్నాయి.