హిమాచల్ ఎన్నికల్లో... కోతుల గోల

    

Last Updated : Nov 4, 2017, 04:18 PM IST
హిమాచల్ ఎన్నికల్లో... కోతుల గోల

హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజలకు లెక్కలేనన్ని హామీలు ఇస్తున్నాయి. వారి సమస్యలను తీర్చేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అలాంటి వరాలలో ఒకటే ప్రజలను కోతుల బారి నుండి రక్షించడం.

హిమాచల్‌లోని పల్లె ప్రాంతాల్లో రైతులు ఎప్పుడూ ఎదుర్కొనే సమస్యల్లో కోతుల బెడద కూడా ఒకటి. ఇవి గుంపులు గుంపులుగా వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. దాంతో ఈ సారి వాటి బెడద వదిలిస్తే గానీ, ఓటు వేసే ప్రసక్తి లేదని ఇప్పటికే అనేక రైతు సంఘాలు మొర పెట్టుకున్నాయి.

హిమాచల్ పల్లెప్రాంతాల్లో దాదాపు 2 వేల గ్రామాలలో ఈ కోతుల బెడద విపరీతంగా ఉందట. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయమై మరో విధంగా స్పందించారు. కాంగ్రెస్ హయాంలోనే కోతుల సంతతి ఇక్కడ విపరీతంగా పెరిగిందని, ఆ ప్రభుత్వం కోతులకు సంతాన నివారణ శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో విఫలమైందని పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ ఎజెండాలో ఈ విషయమై ప్రస్తావించామని తెలిపారు. 

తాజా లెక్కల ప్రకారం  ఒక్క సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఏకంగా 2500 పైచిలుకు కోతులు ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం ఎన్నున్నాయో ఊహించవచ్చు. ఇదే అంశంపై ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖేశ్‌ అగ్నిహోత్ర మాట్లాడుతూ.. కోతుల కోసం ప్రత్యేకంగా స్టెరిలైజేషన్‌ క్యాంపెయిన్‌ను అన్ని చోట్లా నిర్వహిస్తున్నామని, తప్పక ఈ సమస్యకు ఒక నివారణ అనేది తాము కనిపెడతామని చెప్పారు. 

Trending News