కాకినాడ: 'తాను ఎక్కడికి వెళ్లినా.. తన మనసు మాత్రం రాష్ట్రంపైనే ఉంటుంది' అని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎప్పుడు, ఎక్కడికి వెళ్లినప్పటికీ.. అక్కడ ఓ వైపు పనులు చూసుకుంటూనే మరోవైపు అక్కడి నుంచే రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షిస్తుంటానని చంద్రబాబు తెలిపారు. ఓవైపు రాష్ట్రంలో పెథాయ్ తుఫాన్ విధ్వంసం సృష్టిస్తే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అదేమీ పట్టనట్టు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్తారా అని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాల నేతలు చేసిన ఆరోపణలకు స్పందించే క్రమంలో కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల తీరుని విమర్శిస్తూ.. తిత్లి తుఫాన్ వచ్చినప్పుడు జిల్లాలో ఉండి బాధితులను పరామర్శించని వాళ్లకు నన్ను విమర్శించే హక్కు లేదని అన్నారు.
ఈ సందర్భంగా దేశ రాజకీయాల అంశం ప్రస్తావనకు రాగా.. 'గతంలో రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వస్తే వదులుకున్నారు కదా... మరి ఈసారి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు' అని ఓ విలేకరి ప్రశ్నించగా.. 'ఆ అంశం గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు' అని సమాధానం ఇచ్చిన చంద్రబాబు.. అయితే, రానున్న ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని మాత్రం కచ్చితంగా చెప్పగలనని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీరు పట్ల దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందుకు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో ఆ ప్రభావం స్పష్టంగా కన్పించింది. అంతేకాకుండా బీజేపీయేతర కూటమి పట్ల ప్రజల్లోనూ సానుకూల స్పందన కనిపిస్తోంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా తాను మోదీకో లేక టీఆర్ఎస్కో లొంగిపోయే వ్యక్తిని కాదని చంద్రబాబు తేల్చిచెప్పారు.