న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్ వద్ద వున్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై కానీ లేదా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కానీ పాకిస్తాన్ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఐఏఎఫ్ దాడులపై పాకిస్తాన్ సాక్ష్యాధారాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన రాడార్ ఇమేజ్‌లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, పెషావర్ లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మసూద్ అజహర్ సోదరుడు మౌలానా అమర్ మాట్లాడుతూ.. బాలాకోట్ వద్ద భారత వైమానిక దళాలు దాడికి పాల్పడింది వాస్తవమేనని ధ్రువీకరిస్తూ చెప్పిన వీడియో అందుకు మరో ఆధారంగా నిలిచింది.
ఇవన్నీ ఒక ఎత్తైతే, జైషే మహ్మద్ వ్యవస్థాపక అధినేత మసూద్ అజహర్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మూద్ ఖురేషీనే స్వయంగా చెప్పడం మరో సంచలనంగా మారింది. మసూద్ అజార్ పాక్‌లోనే వున్నప్పటికీ.. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగోలేదని ఖురేషీ స్పష్టంచేశారు. ఇదిలావుంటే, పాకిస్తాన్ మిలిటరీ ఆస్పత్రిలో మసూద్ అజార్ డయాలసీస్ చికిత్స చేయించుకుంటున్నాడని ఇంకొన్ని వార్తాకథనాలు ఊటంకించాయి. భారత్ పేరు చెప్పితేనే ఒంటి కాలుపై లేచే మసూద్ అజార్... భారత వైమానిక దళం తమ స్థావరాలపై దాడి చేసినా ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదంటే అసలు అతడు నిజంగానే బతికున్నాడా లేక భారత వైమానిక దళం జరిపిన బాంబు దాడిలో మృతి చెందాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.