SC Reservation: ఎస్సీ వర్గీకరణ అనేది ఏ రాజకీయ పార్టీకీ అడ్వంటేజ్ గా మారనుంది. ఏ పార్టీకీ రాజకీయంగా సమస్యను తీసుకురాబోతుంది. పైకి వర్గీకరణపై పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్న పార్టీలు లోలోన మాత్రం గుబులుగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇంతకీ ఏ పార్టీలో ఏ టాక్ నడుస్తుందనే విషయానికొస్తే.. దాదాపు మూడు దశాబ్దాల కాలం పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఎస్సీ వర్గీకరణ పోరాటానికి ఎట్టకేలకు సుప్రీం ఎండ్ కార్డు వేసింది. ఎస్సీ వర్గీకరణ అమలు సమంజసం అని దేశ అత్యున్నత న్యాయ స్థాన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. సుప్రీం తీర్పుతో మాదిగ సామాజిక వర్గం సంబరాలు జరుపుకుంది. వర్గీకరణతో తమకు పెద్ద ఎత్తున ఫలాలు అందబోతాయనే గంపెడు ఆశలో మాదిగ సామాజిక వర్గం ఉంది. అయితే ఇదే సమయంలో మాల సామాజికవర్గం మాత్రం బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కుతుంది. వర్గీకరణ అమలు చేస్తే చేయడం కానీ మాల సామాజికవర్గానికి మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ఊరకోమని హెచ్చరిస్తుంది. ఒకే సామాజిక వర్గంలోని రెండు ఉప కులాల మధ్య ఈ వర్గీకరణ పంచాయితీనీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా డీల్ చేస్తాయన్న చర్చ జోరుగా జరుగుతుంది. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తే మరో వర్గం తమకు రాజకీయంగా దూరం అవుతారు కదా అని లెక్కలు కడుతున్నారు.
తెలంగాణ విషయానికి వస్తే వర్గీకరణ విషయంలో రేవంత్ సర్కార్ అసెంబ్లీ వేదికగానే ఒక ప్రకటన చేసింది. వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అవసరమైతే వర్గీకరణ కోసం ఒక చట్టాన్ని తేవడానికి కూడా వెనుకాడబోమని రేవంత్ తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. దీని ప్రకారమే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ఆ సమయంలో ఉన్నా మాదిగ సామాజికవర్గంకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ప్రకటనతో బల్లలు చర్చుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కాంగ్రెస్ లోని మాల సామాజికవర్గంకు చెందిన కీలక నేతలు ఎవ్వరూ కూడా వర్గీకరణపై మాట్లాడిన దాఖలాలు లేవు. అదే సమయంలో కొందరు నేతలు మాత్రం వర్గీకరణను తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా మద్దతు తెలిపాల్సి వస్తుందనే భావనలో ఉన్నట్లు ఆ నేతల అనచరులు చెప్పుకుంటున్నారు.
వర్గీకరణ పేరుతో తమ మధ్య లేనిపోని విభేధాలు సృష్టించడం కరెక్ట్ కాదని సెలవిస్తున్నారట. వర్గీకరణ విషయంలో రేవంత్ ప్రకటనపై కూడా అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం చేయలేం కదా అనే భావనలో మాల సామాజికవర్గం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు మాల సామాజిక వర్గం దూరం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారట. వీలైనంత త్వరలో మాల సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలను పిలుచుకొని మాట్లాడితే బాగుంటుందని రేవంత్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా అందుకు సానుకూలంగా స్పందించినట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ఏ వర్గాన్ని దూరం చేసుకోదని ఏళ్లుగా జరుగుతున్న వర్గీకర పోరాటంపై సుప్రీం తీర్పునే అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని రేవంత్ కూడా చెప్పినట్లు తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలిచాయని అలాంటి వర్గాల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని రేవంత్ వారితో చెప్పినట్లు సమాచారం.
ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే వర్గీకరణపై ఆ పార్టీ వైఖరి కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా అనిపించింది. వర్గీకరణపై సుప్రీం తీర్పు వెలువడగానే అది తమ ఘనతే అన్నట్లుగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో వర్గీకకరణపై తీర్మానం చేశామని కేటీఆర్ అన్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా ఆ పార్టీలో కొందరు కీలక నేతలు మాత్రం వర్గీకరణపై కొంత అసంతృప్తిలో ఉన్నారని సమాచారం. మరీ ముఖ్యంగా కేటీఆర్ కోటరీగా ముద్ర ఉన్న మాల సామాజికవర్గం నేతలు ఈ విషయంపై కొంత నిరాశగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అసలే బీఆర్ఎస్ లో మాల సామాజికవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలంగాణ భవన్ లో గుసగుసలు వినపడుతుంటాయి. ఆ సామాజికవర్గానికి చెందిన నేతలకే పార్టీలో కానీ అధికారంలో ఉన్నప్పుడు టాప్ ప్రియారిటీ ఉంటుందనే టాక్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ విషయంలో మాత్రం తొందరపడి ఎలాంటి స్టేట్ మెంట్లు ఇవ్వొద్దని ఆ వర్గానికి చెందిన నేతలకు పార్టీ అధిష్టానం సూచన చేసిందట. ఎలాగో మనం ప్రతిపక్షంలో ఉన్నాము. మనము అంతగా ఆలోచించాల్సిన పనిలేదు. వర్గీకరణపై రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అప్పటి వరకు వేచి చూడాలని చెప్పిందట. ప్రభుత్వ నిర్ణయం తర్వాత అప్పుడు రాజకీయంగా మనం ఏం చేయాలో డిసైడ్ చేద్దాం అప్పటి వరకు కాస్తా సైలెంట్ గా ఉండమని గులాబీ అధిష్టానం చెప్పిందని ప్రచారం జరుగుతుంది.
వర్గీకరణ విషయంలో తమకు పూర్తి స్థాయిలో ఓ స్పష్టత ఉందని బీజేపీ చెబుతుంది. ఆ స్పష్టత ఉంది కాబట్టే తాము మంద కృష్ణ పోరాటానికి ప్రధానీ మోదీ సైతం మద్దతు పలికారని బీజేపీ గుర్తు చేస్తుంది. మాదిగలకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది కాబట్టి వారికి న్యాయం చేయడానికే మోదీ ముందుకు వచ్చారని కమలం పార్టీ చెబుతుంది. అందుకే వర్గీకరణ విషయంలో సుప్రీంలో కేంద్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించి వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన వచ్చేలా చేసిన ఘనత తమదే అని బీజేపీ చెబుతుంది. మాదిగలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెబుతున్నారు. ఐతే దీనిలో రాజకీయ కోణం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అంటే మొదట్లో కేవలం అగ్రకులాలకు పెద్ద పీట వేస్తుందనేది ప్రచారం ఉండేది. కానీ మోడీ ప్రధాని అయ్యాక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కూడా బీజేపీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ఇక దేశంలోనే అత్యధికంగా జనాభా కలిగిన ఎస్సీ సామాజికవర్గం మాత్రం బీజేపీకీ ఎప్పటి నుంచో కొంత దూరంగా ఉంటూ వస్తుంది. తమ బావజాలానికి బీజేపీ సిద్దాంతం విరుద్ధమని అందుకే తమకు ఆ పార్టీతో పొసగదు అనేక మంది చెబుతుంటారు. కానీ బీజేపీ తాజాగా వదిలిన ఈ వర్గీకరణ అంశం మాత్రం దక్షిణ భారతంలో కొంత మేర బీజేపీకీ రాజకీయంగా లబ్ది జరగవచ్చని ప్రచారం జరగుతుంది.
మొత్తానికి రాజకీయ పార్టీలు వర్గీకరణపై ఎలా క్రెడిట్ పొందాలి..ఇతర పార్టీలను ఎలా ఇరికించాలి అనే కోణంలో వ్యూహాలు పన్నుతున్నాయి. రానున్న రోజుల్లో వర్గీకరణంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై పార్టీలు ఎలా స్పందిస్తాయి. సొంత పార్టీలోని నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter