అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన విలీనం హామీని నెరవేర్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి గత శాసన సభ సమావేశాల్లో విలీన ప్రక్రియ బిల్లును ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుకు అసెంబ్లీ వెంటనే ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ బిల్లుకు ఇటీవలే ఆమోదం తెలపగా.. ఏపీ సర్కార్ త్వరలోనే దీనిపై ఒక గెజిట్ను విడుదల చేయనుంది. ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఏపిఎస్ఆర్టీసీ కార్మికులు జనవరి 1వ తేదీ 2020 నుండి అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం.. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన విలీనం హామీ ప్రక్రియను వేగవంతం చేసింది. కేబినెట్ నిర్ణయంపై ఇటీవలే గవర్నర్ నుంచి సైతం ఆమోదం లభించడంతో రాష్ట్రంలోని 52,000 మంది ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభించనుంది.