1994లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న అనంతరం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుష్మితా సేన్ ఆ తర్వాత నటిగా ఆడియెన్స్ హృదయాలు గెలుచుకుని ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అందం, అభినయంతో ఆడియెన్స్‌ని కట్టిపడేయడమేకాకుండా రెనీ, అలిషా అనే ఇద్దరు ఆడ పిల్లలను దత్తత తీసుకుని కన్నబిడ్డల్లా పెంచుకుంటూ మనసున్న మనిషిగానూ పేరు సొంతం చేసుకుంది సుష్మితా సేన్. అలా దశాబ్ధాల తరబడిగా ఆడియెన్స్ మదిలో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న ఈ విశ్వ సుందరికి కూడా ఒకానొక దశలో లైంగిక వేధింపులు తప్పలేదట. తాజాగా ''మేక్ యువర్ సిటీ సేఫ్'' అనే ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న సుష్మితా.. ఆరు నెలల క్రితం ఓ అవార్డ్స్ ఫంక్షన్లో తనకు ఎదురైన ఓ చేదు ఘటనను మీడియాతో పంచుకుంది.
"అవార్డ్స్ ఫంక్షన్‌లోకి తాను ఎంటరైనప్పుడు అక్కడ భారీగా జన సందోహం వుంది. అభిమానులు అందరూ చుట్టుముట్టారు. బాడీగార్డ్స్ సహాయంతో జనం మధ్యలోంచే తాను లోపలికి వెళ్తుండగా ఓ చేయి తనని అసభ్యంగా తడమడం గమనించాను. వెంటనే ఆ చెయ్యిని బలంగా పట్టి బయటికి లాగాను. చూస్తే, అతడు ఓ 15 ఏళ్ల కుర్రాడు. అతడి వయస్సు చూసి ఏమనాలో అర్థం కాక అతడితో సరదాగా ముచ్చటిస్తున్నట్టుగా నటిస్తూ ఇంకొంత ముందుకు తీసుకెళ్లాను. ఇప్పుడు ఇక్కడ తాను కానీ సీన్ క్రియేట్ చేశానంటే, నువ్వు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. జీవితం నాశనం అవుతుంది. కానీ అలా చేయడం తనకు ఇష్టం లేదు అని గట్టిగా మందలించి వదిలేశాను" అని అప్పటి చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తంచేశారామె.