ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు తన మంత్రివర్గంతో నిర్వహించిన సమావేశంలో పలు ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశం ముగిశాక ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా పోరాటం చేయాలని తాము భావించామని ఆయన అన్నారు. అలాగే ఇదే విషయం మీద సుప్రీం కోర్టును ఆశ్రయించాలని.. వీలైతే సొంతంగా పిల్ వేయాలని కూడా నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇదే సమావేశంలో ప్రజలకు మేలు చేసే పలు నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకుందని ఆయన అన్నారు.
ముఖ్యంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం క్రింద ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని భావించిన సర్కారు, గృహ నిర్మాణ శాఖకు రూ.1,480 కోట్లు కేటాయించడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే విశాఖను ప్రపంచ స్థాయి క్రీడా నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం యోచిస్తుందని.. అందుకుగాను భూసమీకరణ కోసం మంత్రి మండలి ఆమోదం తెలిపిందని కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
అలాగే అరకులోయలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీనివాసుని ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించాలని కూడా ప్రభుత్వం భావించింది. అలాగే విశాఖ మధురవాడలోని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ యాజమాన్యం కోసం 40 ఎకరాలు కూడా ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఏలూరును స్మార్ట్ సిటీగా మార్చేందుకు షాపూర్జీ పల్లంజీకి ప్రాజెక్టు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే పీఎంఏవై గృహాలకు స్టాంపు డ్యూటీ మినహాయింపు కూడా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.