Women's IPL To Begin From 2023 says BCCI President Sourav Ganguly: మహిళా క్రికెటర్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. 2023లో మహిళల ఐపీఎల్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుందని బోర్డు ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపారు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దాదా చెప్పారు. అయితే ఈ సీజన్‌లో మాత్రం గతంలో మాదిరిగా మూడు జట్ల మధ్య నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరుగుతాయి.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'మహిళల కోసం పూర్తి స్థాయి ఐపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనికి ఆమోదం పొందాల్సి ఉంది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ఆరంబించడమే మా లక్ష్యం' అని తెలిపారు. ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ సమయంలోనే మహిళల కోసం నాలుగు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ పేర్కొన్నారు.
మొదటి మహిళల ఐపీఎల్‌ను 5 లేదా 6 జట్లతో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. మహిళల టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆసక్తిని చూపిస్తున్నాయని తెలుస్తోంది. మహిళల జట్లు కొనుగోలు చేసేందుకు ప్రస్తుత ఫ్రాంచైజీలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా నిర్ణయించిందట. మూడు ఫ్రాంచైజీలు జట్లను కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2022లో పది జట్లు ఆడుతున్న విషయం తెలిసిందే.
మహిళల ఐపీఎల్ లీగ్‌ను ప్రారంభించాలని బీసీసీఐపై గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. మాజీలు కూడా ఐపీఎల్ లీగ్ ఆరంభించాలని అంటున్నారు. మరోవైపు క్రికెట్ వెస్టిండీస్ కూడా ఈ సంవత్సరం సీపీఎల్‌తో పాటు మూడు జట్ల లీగ్‌ను ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఇదే ఆలోచనలో ఉంది. దాంతో బీసీసీఐ కూడా మహిళల ఐపీఎల్‌ను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో వాణిజ్యపరమైన రాబడితో సంబంధం లేకుండా మహిళల లీగ్‌ను బీసీసీఐ ఆరంభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook