టీమిండియా క్రికెటర్లకు భారీగా జీతాలు పెంచుతూ బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదికిగాను రూపొందించిన నూతన గ్రేడింగ్ విధానం ప్రకారం గ్రేడ్ ఏ ప్లస్ కింద రూ.7కోట్లు, గ్రేడ్ ఏ కింద రూ.5కోట్లు, గ్రేడ్ బీ కింద రూ.3కోట్లు, గ్రేడ్ సీ కింద రూ.1కోటి ఇవ్వనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ ఈరోజు విడుదల చేసిన కొత్త కాంట్రాక్ట్ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని గ్రేడ్ ఏలో చేర్చగా, మహ్మద్ షమి పేరు అసలు జాబితాలోంచే గల్లంతయ్యింది. ఏ ప్లస్ గ్రేడ్‌లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్ర్పీత్ బుమ్రా ఉన్నారు. బీసీసీఐ ప్రకటన ప్రకారం ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లు అందరూ ఏడాదికి రూ.7కోట్ల పారితోషికం అందుకోనున్నారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కారణంగానే అతడి పేరుని ఏ ప్లస్ గ్రేడ్‌లో కాకుండా ఏ గ్రేడ్‌లో చేర్చినట్టు తెలుస్తోంది.
ఎం.ఎస్. ధోనీ, రవిచంద్రన్ అశ్విన్, అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్ సాహా, మురళీ విజయ్ లాంటి ఏ గ్రేడ్ ఆటగాళ్లు ఏడాదికి రూ.5కోట్ల పారితోషికం అందుకోనున్నారు. బీ గ్రేడ్‌లో వున్న హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, కుల్‌దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, చాహల్, ఇషాంత్ శర్మ, దినేశ్ కార్తీక్ రూ.3కోట్ల పారితోషికం పొందనున్నారు.
ఇక సీ గ్రేడ్‌లో వున్న సురేశ్ రైనా, కేదార్ జాదవ్, మనీశ్ పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, పార్ధివ్ పటేల్, జయంత్ యాదవ్ రూ.1కోటి పారితోషికం అందుకోనున్నారు. గతంలో బీసీసీఐ ప్రకటించిన ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితాల్లో ఏ ప్లస్ గ్రేడ్ వుండేది కాదు. కానీ ఈసారి కొత్తగా ఏ ప్లస్ గ్రేడ్‌ని చేర్చిన బీసీసీఐ.. ఆ గ్రేడ్ పరిధిలో వుండే ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని పారితోషికంగా ప్రకటించింది. ఏ- గ్రే కింద రూ.2కోట్లు, బీ గ్రేడ్ కింద రూ.1కోటి, సీ గ్రేడ్ కింద రూ.50 లక్షలు పారితోషికం చెల్లించేది.