Jagga Reddy: జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి షాక్... కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగింపు...

Revanth Reddy shock to MLA Jagga Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం షాకిచ్చింది. జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవితో పాటు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యత నుంచి తప్పించింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 09:00 PM IST
Jagga Reddy: జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి షాక్... కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగింపు...

Revanth Reddy shock to MLA Jagga Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం షాకిచ్చింది. జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవితో పాటు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యత నుంచి తప్పించింది. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరిస్తూ జగ్గారెడ్డి పదేపదే బహిరంగ సవాళ్లు చేయడం వల్లే ఆయనపై వేటు వేసినట్లు తెలుస్తోంది. 

ఆదివారం (మార్చి 20) జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేతల ప్రత్యేక భేటీ అనంతరం జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సంగారెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామాకు తాను సిద్ధమని.. దమ్ముంటే తనపై అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అంతేకాదు, పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై రోజుకో బండారం బయటపెడుతానని పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించారు. తనను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

కొద్దిరోజుల క్రితమే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. పార్టీలో తనకు సరైన గౌరవం, గుర్తింపు దక్కడం లేదని భావిస్తున్న జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతీసారి బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది కావాలనే తనపై కోవర్టు ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

కాగా, రాజీనామాకు సిద్ధపడిన జగ్గారెడ్డిని పలువురు సీనియర్ నేతలు వారించడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కొద్దిరోజులు వేచి చూస్తానని ప్రకటించారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్‌లకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరిస్తానన్నారు. నిజానికి ఈ నెల 21న సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. కానీ ఆ తర్వాత సభ ఆలోచనను విరమించుకున్నారు.
 

Trending News