Mallu Swarajyam Passes Away: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. ఆమె వయసు 91 ఏళ్లు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కొద్దిరోజులుగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలోనే స్వరాజ్యం తుది శ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం మృతిపై సీపీఎం నేతలు బీవీ రాఘవులు సహా పలువురు సంతాపం ప్రకటించారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం (మార్చి 19) నల్గొండలో జరుగుతాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలిపారు.
మల్లు స్వరాజ్యం ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో 1931లో జన్మించారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన స్వరాజ్యం.. ఐదో తరగతి వరకే చదువుకున్నారు. విప్లవ భావాలు ఆమెను సాయుధ పోరాటం వైపు నడిపించాయి. 1945-1948 కాలంలో తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలకంగా వ్యవహరించారు. చేతిలో తుపాకీ పట్టి నిజాం నిరంకుశత్వానికి ఎదిరించారు.
సాయుధ పోరాటంలో భాగంగా మల్లు స్వరాజ్యం స్వయంగా పాటలు పాడుతూ తెలంగాణ ప్రజలను చైతన్యపరిచారు. పెద్ద ఎత్తున ప్రజలను సాయుధ పోరాటం వైపు కదిలించారు. 1978, 1983లో సీపీఎం తరుపున తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మల్లు స్వరాజ్యం భర్త వెంకట నర్సింహారెడ్డి నల్గొండ జిల్లా సీపీఎం కార్యదర్శిగా, ఉమ్మడి తెలుగు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2004లో ఆయన కన్నుమూశారు. స్వరాజ్యం దంపతులకు ఒక కుమార్తె కరుణ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె కరుణ 2009లో నల్గొండ నుంచి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కుమారుల్లో ఒకరు న్యాయవాది కాగా మరొకరు వైద్యుడిగా స్థిరపడ్డారు.
Also read : RRR: 'ఆర్ఆర్ఆర్'కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook