సీటు బెల్టు పెట్టుకుంటే హరికృష్ణ బతికేవారు..!

నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్‌ నేత నందమూరి హరికృష్ణ కన్నుమూశారు.

Last Updated : Aug 29, 2018, 03:37 PM IST
సీటు బెల్టు పెట్టుకుంటే హరికృష్ణ బతికేవారు..!

నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్‌ నేత నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ  ప్రయాణిస్తున్న టయోటా ఫార్చ్యూన్ కారు పల్టీలు కొట్టడంతో ఆయన తలకు బలమైన గాయాలు కాగా.. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హరికృష్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నెల్లూరులో ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

అయితే ప్రమాద సమయంలో హరికృష్ణ స్వయంగా కారు డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. వాటర్‌ బాటిల్‌ కోసం హరికృష్ణ వెనక్కి తిరిగేసరికి కారు మలుపు వద్ద రాయిపైకి ఎక్కి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఆయన సీటుబెల్ట్‌ ధరించలేదని.. సీటుబెల్ట్‌ పెట్టుకుంటే ఆయన బతికుండేవారని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నివాసం నుంచి ఉదయం 4:30 గంటలకు బయల్దేరి వెళ్లారని, స్వయంగా డ్రైవింగ్ చేయడానికే హరికృష్ణ ప్రాధాన్యత ఇస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా 2014లో హరికృష్ణ  పెద్దకుమారుడు ఎన్. జానకీరామ్ కూడా నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. 2009లో ఎన్నికల ప్రచార సమయంలో సూర్యాపేట సమీపంలో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.   

ఈ ఉదయం 4:30 గంటలకు హరికృష్ణ ఇంటి నుంచి బయలుదేరి, ఉదయం 8.30 గంటలకు నెల్లూరులోని కావలికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ అభిమానుల వివాహానికి హాజరై అనంతరం 300 కిలోమీటర్ల దూరంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగే ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ రెడ్డి వివాహానికి హరికృష్ణ  హాజరవాల్సి ఉంది.

Trending News