హైదరాబాద్: కోస్తాంధ్రాను వణికిస్తున్న పెథాయ్ తుఫాను ప్రభావం ఆంధ్రాపై మాత్రమే కాకుండా తెలంగాణలోనూ కనిపిస్తోంది. పెథాయ్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట ఆదివారం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పస్రా, వాజేడు, మహబూబాబాద్, జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, రఘనాథపల్లి, వేలేరు, చిల్పూర్, ధర్మసాగర్ మండల్లాలో ఆదివారం నుంచే వర్షం కురుస్తోంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలోని శ్రీరాంపూర్, ఓదెల మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై పెథాయ్ తుఫాన్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఈ రెండు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.
వరంగల్ రూరల్ జిల్లాలోనూ పెథాయ్ ప్రభావం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో కోతకు వచ్చిన వరిపంట, ఇటీవలే వేసిన నాట్లు దెబ్బతింటున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలావుంటే, మరోవైపు తుఫాన్ ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లోనూ వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో చెదురుముదురు జల్లులు కురిశాయి.