టాలీవుడ్, బాలీవుడ్ అని ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి పెద్దగా పరిచయమే అక్కర్లేదు. దక్షిణాదిన తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ భాషలతోపాటు ఉత్తరాదిన హిందీ, మరాఠి భాషా చిత్రాల్లోనూ విభిన్నమైన పాత్రలు చేసి దేశవ్యాప్తంగా ఆడియెన్స్‌కి సుపరిచితుడైన ఆర్టిస్ట్ ఆయన. గత రెండున్నరేళ్ల కాలంలో అనేక సందర్భాల్లో కేంద్రంలో అధికారంలో వున్న మోదీ సర్కార్‌పై విరుచుకుపడుతూ, మోదీ రాజకీయాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వస్తోన్న ప్రకాశ్ రాజ్‌ని తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఇంటికి పిలిపించుకుని, ఆ రోజంతా అతడిని తన వెంటపెట్టుకుని అసెంబ్లీకి, ఆఫీస్‌కి కూడా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అలా రోజంతా ఆ ఇద్దరూ కలిసి చర్చించుకున్న అంశాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత, జాతీయ రాజకీయాలు, ప్రస్తుతం దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు, ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను సీఎం కేసీఆర్ ప్రకాశ్ రాజ్‌కి వివరించగా... తెలంగాణలో, కర్ణాటకలో తాను దత్తత తీసుకున్న గ్రామాల్లో తాను చేపట్టిన అభివృద్ధి గురించి ప్రకాశ్ రాజ్ సీఎం కేసీఆర్‌కి తెలిపారు. ఇరువురి మధ్య జరిగిన ఈ సుదీర్ఘమైన భేటీలో తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్.. కేసీఆర్ ఆలోచనలను ప్రశంసించినట్టు తెలుస్తోంది. తాను కూడా దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పును కోరుకుంటున్నానని, అవసరమైతే ఫెడరల్ ఫ్రంట్‌లో ఓ భాగస్వామిగా ఉంటూ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తన వంతు కృషిచేయడానికి తాను సిద్ధంగా వున్నానని కేసీఆర్‌కి హామీ ఇచ్చినట్టు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతుబంధు పథకం లాంటివి అద్భుతమైనవి అని ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్రశంసలు గుప్పించారు. ఇదంతా పరిశీలిస్తే, ప్రకాశ్ రాజ్ ఇకపై రానున్న కాలంలో పాలిటిక్స్‌తో బిజీ కానున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామిగా సేవలు అందించడానికి సిద్ధం అని ప్రకాశ్ రాజ్ చెప్పారంటే ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీపై డౌటే లేదంటున్నారు ఇంకొంతమంది.