సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2017 ఫలితాల్లో తెలుగు కీర్తి పతాకం వెల్లివిరిసింది. తెలంగాణ జగిత్యాల మెట్‌పల్లికి చెందిన అనుదీప్ దురిశెట్టి ఈ పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తెలుగు విద్యార్థుల సత్తాని జాతీయస్థాయిలో చాటాడు. గతేడాది అక్టోబర్- నవంబర్ నెలల మధ్య యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య మౌఖిక పరీక్షలు నిర్వహించి 990 మంది పేర్లను యూపీఎస్సీ ఎంపిక చేయడం గమనార్హం. ఆ 990 మంది అభ్యర్థుల్లో అనుదీప్ తొలి ర్యాంకుతో టాపర్‌గా నిలవడం విశేషం.
ఇప్పటికే నాలుగు సార్లు సివిల్స్ రాసిన అనుదీప్, అయిదోసారి (ఆఖరి ప్రయత్నంలో) విజయతీరాలను చేరుకోవడం గమనార్హం. ఆంత్రోపాలజీని మెయిన్స్‌లో ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకున్న 28 ఏళ్ల అనుదీప్ తండ్రి తెలంగాణలోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో అసిస్టెంటు డివిజనల్ ఇంజినీరుగా సేవలందిస్తున్నారు.
మెట్పల్లి శ్రీ సూర్యోదయ హైస్కూలులో చదువుకున్న అనుదీప్, తన బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) కోర్సును బిట్స్ పిలానీలో చేశాడు. ఆ తర్వాత గూగుల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేరాడు. 2013లో తన రెండవ ప్రయత్నంలోనే అనుదీప్ ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్)కు ఎంపికయ్యాడు. అలా ఎంపికయ్యాక కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసరుగా సెలక్టయ్యాడు.
ఆ తర్వాత ఉద్యోగం చేసుకుంటూనే మళ్లీ సివిల్స్ రాయడం ప్రారంభించాడు. తన అయిదవ ప్రయత్నంలో ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. ఇవే యూపీఎస్సీ పరీక్షల్లో సీబీఐ పూర్వజేడీ లక్ష్మీనారాయణ కుమారుడు సాయి ప్రణీత్ 196 ర్యాంకు సాధించాడు.