Telangana Survey: సంచలనాలకు మారుపేరుగా నిలిచే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరో యూటర్న్ తీసుకోబోతున్నారా? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆయన అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరేందుకు చూస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మళ్లీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి మల్లారెడ్డి మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని కొంత రేవంత్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: KTR: రేవంత్ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుల, ఆర్థిక, విద్య, రాజకీయ సర్వే చేపట్టింది. బుధవారంతో ప్రారంభమైన ఇంటింటికి సర్వేలో మేడ్చల్ ఎమ్మెల్యే హోదాలో మల్లారెడ్డి పాల్గొని కుల గణన కార్యక్రమాన్ని పరోక్షంగా స్వాగతించారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇన్ని రోజులు బీసీలు ఓట్లు వేశారు రెడ్లు పరిపాలించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఓట్లు వేసేది బీసీలు.. పరిపాలించింది ఓసీలు' అని తెలిపారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేలా కుల గణన కార్యక్రమం చేపట్టిందని మాజీ మంత్రి మల్లారెడ్డి వివరించారు. కుల గణనలో అందరూ పాల్గొని వివరాలు ఇవ్వాలని సూచించారు.
Also Read: Rahul Gandhi: బావర్చీ హోటల్లో రాహుల్ గాంధీ కోసం బిర్యానీ వెయిటింగ్.. వైరల్ వీడియో
పార్టీకి విరుద్ధంగా..
కుల గణన కార్యక్రమంపై బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం తప్పుబడుతోండగా.. మల్లారెడ్డి మాత్రం మద్దతుగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. కుల గణన పేరుతో ప్రజల వ్యక్తిగత వివరాలు తీసుకుని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ కేటీఆర్‌కు విరుద్ధంగా మల్లారెడ్డి కుల గణనలో స్వయంగా పాల్గొనడమే కాకుండా సర్వేకు సానుకూలంగా మాట్లాడడం హాట్ టాపిక్‌గా మారింది.
కాంగ్రెస్ తో సత్సంబంధాలు
కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీతో మల్లారెడ్డి సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు మేడ్చల్‌లో చర్చ జరుగుతోంది. తన బద్ధ శత్రువుగా మారిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రేశ్ యాదవ్‌తో మల్లారెడ్డి కలిసి తిరుగుతున్నారు. దీనికితోడు తన మనవరాలి వివాహం సందర్భంగా మల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులను భారీగా ఆహ్వానించారు. రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానాలు పలికారు. ఇక మల్లారెడ్డికి కాంగ్రెస్ కూడా ప్రాధాన్యం ఇస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగా మల్లారెడ్డి మనవరాలి వివాహానికి రేవంత్‌తో సహా మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి యూటర్న్.. రేవంత్ రెడ్డి కార్యక్రమానికి మద్దతు