టీడీపీ, బీజేపీ మధ్య స్నేహబంధం తెగనుందన్న వార్తలు వస్తున్న తరుణంలో.. ఆ వార్తకు మరింత బలం చేకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. ఇద్దరూ 2019 ఎన్నికల అంశంతో పాటు, బీజీపీ కూటమితో పొత్తు అనే అంశాలపై మాట్లాడుకున్నారు. శివసేన 2019 ఎన్నికలకు ఒంటరిగా వెళుతుందని.. బీజేపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే..!!
శివసేన సీనియర్ నాయకుడు మాట్లాడుతూ-" ఈ టెలిఫోన్ సంభాషణ కొత్తేమీ కాదు. ఇద్దరూ 10 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. భారత రాజకీయాలపై చర్చించారు" అని అన్నారు.
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు 'బీజేపీ పార్టీ తమతో కలిసి నడవాలని అనుకోకపోతే.. దండం పెట్టి పక్కకు తప్పుకుంటాం' అని వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి చంద్రబాబు నాయుడు కేంద్ర బడ్జెట్ 2018పై అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి నేడు అమరావతిలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018ని సమర్పించిన తరువాత టీడీపీ నాయకుడు సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వనరులపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. 'నేడు సమర్పించిన కేంద్ర బడ్జెట్‌తో ఏపీ ప్రజలు, పార్టీ శ్రేణులు నిరాశ చెందారు. రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాజధాని అమరావతికి నిధులు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఇతర అంశాలపై బడ్జెట్‌లో ప్రస్తావించలేదు' అని చెప్పారని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరి అన్నట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది