Road Shows Ban In AP: ఏపీలో వరుస విషాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. కందుకూరు, గుంటూరులో టీడీపీ సభలు నిర్వహించగా.. తొక్కిసలాటలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులపై సభలు, సమావేశాలను రద్దు చేసింది ప్రభుత్వం. అదేవిధంగా మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రోడ్లకు దూరంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించింది. అధికారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు నిర్వహించాలని స్పష్టం చేసింది. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో అనుమతి ఉంటుందని పేర్కొంది. షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇటీవల రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలలో కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయిం తీసుకుంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టింది.
ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నాయి. నారా లోకేష్ పాదయాత్ర ప్రకటించగా.. పవన్ కళ్యాణ్ యాత్రపై కూడా త్వరలోనే ప్రకటన రానుంది. ఆయన ఇప్పటికే ప్రచారం వాహనం కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు 'ఇదేం ఖర్మ..' అంటూ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టినట్లు అయిందని నిపుణులు చెబుతున్నారు. ఇక నుంచి జనావాసాలకు దూరంగా సభలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.
గుంటూరు దుర్ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. చంద్రబాబు సభ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి వారిని ఆదుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయంతో పాటు రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని చెప్పిన విషయం తెలిసిందే.
Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్
Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Politics: టీడీపీకి షాక్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం