కొనసాగుతున్న తుఫాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

కొనసాగుతున్న తుఫాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

Updated: Oct 30, 2019, 04:30 PM IST
కొనసాగుతున్న తుఫాను ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
File photo

హైదరాబాద్: అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం మాల్దీవులు, కోమరన్ ప్రాంతాలను ఆనుకుని నైరుతి దిశలో పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మాల్దీవులకు ఉత్తర ఈశాన్య దిశగా 450 కిలోమీటర్లలో, తిరువనంతపురానికి పశ్చిమ నైరుతి దిశగా 220 కిలోమీటర్ల దూరంలో, మినికాయ్‌కి తూర్పు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా కదులుతూ లక్ష ద్వీప్ వైపు పయనిస్తోన్న వాయుగుండం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండగా మారి.. 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు అరేబియా మహా సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను ప్రభావంతో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 

ఇదిలావుంటే, కోస్తాంధ్ర, రాయలసీమలోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో గత రెండురోజులుగా పలు చోట్ల వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే.