CM YS Jagan's one year govt : సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఎగుడు దిగుడులు

ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రమాణ స్వీకారం చేసి రేపటితో ఏడాది పూర్తవుతోంది. 3 వేల 648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో అనుకున్న లక్ష్యాన్ని అఖండ మెజార్టీతో సాధించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించిన జననేతగా పేరు తెచ్చుకున్న జగన్  2019 మే 31న రాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Last Updated : May 30, 2020, 04:42 PM IST
CM YS Jagan's one year govt : సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలనలో ఎగుడు దిగుడులు

ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రమాణ స్వీకారం చేసి రేపటితో ఏడాది పూర్తవుతోంది. 3 వేల 648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో అనుకున్న లక్ష్యాన్ని అఖండ మెజార్టీతో సాధించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించిన జననేతగా పేరు తెచ్చుకున్న జగన్  2019 మే 31న రాష్ట్ర ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది పాలనలో తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు జగన్‌లోని దూకుడుకు నిదర్శనంగా నిలిస్తే... ఆయన అమలు చేసిన పలు సంక్షేమ పథకాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అనుకున్నది అమలు చేసే దిశగా మొండిగా వెళ్తున్నారన్న విమర్శలు ఓ వైపు… ప్రజా సంక్షేమ పథకాల్లో రాజీ పడకపోవడంపై ప్రశంసలు మరోవైపు... వెరసి ఏడాది జగన్ పాలన ( YS Jagan`s first year as Andhra CM ) సంతృప్తికరంగానే సాగిందని చెప్పవచ్చు.

సంక్షేమ పథకాలు
హామీల్లో ప్రధానంగా ఇచ్చినవి నవ రత్నాలు ( Navaratnalu ). కానీ వాస్తవానికి చేసినవి లెక్క పెడితే అంతకంటే ఎంతో ఎక్కువే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రధాన హామీ పెన్షన్ పెంపు ( Pension hike ). రెండోది అమ్మఒడి ( Amma vodi ), మూడవది జగనన్న రైతు భరోసా ( Rythu bharosa ). వృద్ధాప్య పెన్షన్లను దశలవారీగా పెంచుతానని చెప్పినట్టే రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేశారు. అమ్మఒడిలో భాగంగా తల్లుల అక్కౌంట్‌లో 15 వేల రూపాయలు జమ అయ్యాయి. ఇక రైతు భరోసా పథకం విషయానికొస్తే.. రైతు కుటుంబానికి 13 వేల 5 వందల రూపాయలు వారి ఖాతాలో జమ అయ్యాయి. ఇక ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడం, డయాలసిస్ రోగులకు పది వేలు అందించడం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొత్త రాష్ట్రంగా నిధుల కొరత ఉన్నా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమ పథకాలకే పెద్దపీట వేశారు. 

ఆర్టీసీ విలీనం..దిశ చట్టం 2019.. ( APSRTC merger, Disha act 2019 )..
వైఎస్ జగన్ ఏడాది పాలనలో చెప్పుకోదగ్గవిగా ఆర్టీసీ విలీనం, దిశ చట్టం-2019 ఉన్నాయి. ఏళ్ల తరబడి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్ ఏదైనా ఉందా అంటే అది ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయమనడమే. పాదయాత్రలో దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన జగన్... అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేశారు. ఇక హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన నేపథ్యంలో వెంటనే స్పందించిన జగన్ దేశంలోనే తొలిసారిగా మహిళలకు సత్వర న్యాయం కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం వంటి కేసుల్లో వారం రోజుల్లోనే కఠినమైన శిక్ష కచ్చితంగా పడుతుంది. తొలిసారిగా ఏపీలోనే మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. 

వాలంటీర్ వ్యవస్థ ( Grama volunteers )
జగన్ ఏడాది పాలనలో సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నది వాలంటీర్ వ్యవస్థ. గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌లను నియమించి ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకు తీసుకురాగలిగారు. అంతేకాదు ఈ వాలంటీర్ల సహాయంతో వృద్ధాప్య పెన్షన్లను రికార్డు స్థాయిలో లబ్ధిదారుల కాళ్ల దగ్గరకు ఒకటవ తేదీనే తీసుకురాగలిగారు. అంతకుమించి ప్రస్తుత కరోనా సంక్షోభంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలకు సైతం ఈ వాలంటీర్ వ్యవస్థ తోడ్పడుతోంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండటంతో… ఇంటింటిని జల్లెడ పట్టి వైరస్ సోకిన బాధితులను గుర్తించడానికి ప్రభుత్వానికి మార్గం సులువైంది. ఏ ఇంటికైనా బయట్నించి ఎవరైనా వచ్చారా ? లేదా ఏ ఇంట్లోనైనా కరోనా లక్షణాలున్న వ్యక్తి ఉన్నారా అనేది తెలుసుకోవడం ఏపీ ప్రభుత్వానికి చాలా సులభమైంది. 

రివర్స్ టెండరింగ్ ( Reverse tendering )
ప్రభుత్వ పనుల్లో ముఖ్యంగా కాంట్రాక్టుల్లో పారదర్శకతను పెంపొందించేందుకు, అవినీతి రహితంగా మార్చి ప్రజా ధనాన్ని ఆదా చేసేందుకు ఉద్దేశించిన రివర్స్ టెండరింగ్ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఒక్క ఏడాదిలోనే రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా రూ. 850 కోట్ల వరకూ ప్రభుత్వ ధనం ఆదా అయినట్టు ప్రభుత్వమే ప్రకటించింది. 

దూకుడు విధానాలు… ఏపీకి మూడు రాజధానులు ( Three capital cities of AP )
అభివృద్ధి పనులకు, అనుకున్న పనులకు విఘాతం కల్గిస్తున్నారన్న ఆలోచనతో వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం ( 3 capital cities of AP ) విషయంలో అమరావతి ప్రాంతంలోని రైతుల నుంచి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మూడు పట్టణాలను రాజధానులుగా ప్రకటించి విశాఖపట్నం ( Visakhapatnam ), అమరావతి ( Amaravati ), కర్నూలు ( Kurnool ) రాజధానులుగా ఉంటాయని జగన్ తీసుకున్న నిర్ణయం దూకుడుగానే కన్పిస్తోంది. పెద్దల సభలో మెజార్టీ ఉన్న టీడీపీ ఈ బిల్లును అడ్డుకోవడంతో... ఏకంగా విధానసభనే రద్దు చేస్తూ కేంద్రానికి ప్రతిపాదన పంపడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా ఇంగ్లీషు మీడియంగా ( English medium in govt schools ) మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై సైతం ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తూ కోర్టు మెట్లెక్కినా సరే జగన్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. అయితే, ఈ ప్రతిపాదనపై మాత్రం ప్రజల నుంచి మద్దతు భారీగా లభిస్తోంది. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) తొలగింపు వ్యవహారం...
ఇక కరోనా భూతం చూపి.. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించిన తీరు జగన్‌పై విమర్శలకు తావిచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తప్పించి... ఆ స్థానంలో కనగరాజును నియమించడంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీనికి సంబంధించి తాజాగా ఏపీ హైకోర్టు ( AP high court ) కూడా ఏపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. అంతేకాకుండా ఇకపై నిమ్మగడ్డనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని హై కోర్టు స్పష్టంచేసింది. ఇప్పుడిప్పుడే ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్నామని సంబరాలు జరుపుకోవాలని భావిస్తున్న జగన్ సర్కార్‌కి ఈ అంశం కొంత ఇబ్బంది కల్గించే పరిణామంగానే విశ్లేషకులు భావిస్తున్నారు. 

విశాఖ విష వాయువల లీకేజ్ ఘటన బాధితుల్ని ( Vizag gas leak tragedy victims ) ఆదుకున్న విధానం…
నిన్నటి వరకూ జగన్‌పై ప్రతిపక్షం చేసిన ఆరోపణ ఆయనకు పరిపాలనపై అనుభవం లేదని. కానీ విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ( LG Polymers gas leak issu ) జగన్ స్పందించిన తీరు మాత్రం ప్రతిపక్షాన్ని నోరు మెదపకుండా చేసేసింది. కావల్సింది అనుభవం కాదు... అవగాహన అని నిరూపించారు జగన్. ఘటన జరిగిన గంటల్లోనే విశాఖకు పయనమైన జగన్... నేరుగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని, బాధిత కుటుంబాల్ని కలిసి పరామర్శించారు. వారిని ఓదార్చారు. మీకు నేనున్నానంటూ భరోసా కల్పించారు. అంతేకాదు గతంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మృతుల కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం అందర్నీ ఆశ్చర్చపర్చింది. అంతేకాదు... పరిహారంపై ప్రకటన చేసిన మూడు రోజుల్లేనే ఆ అంశాన్ని నాన్చకుండా పరిహారాన్ని బాధితుల ఖాతాల్లోకి వేయగలిగారు. విశాఖ పాలిమర్స్ ఘటనపై జగన్ సర్కార్ ( CM YS Jagan`s govt ) స్పందించిన తీరును జాతీయ మీడియా సైతం కొనియాడింది.
రేపటికల్లా నగదు మీ ఖాతాల్లో పడుతుంది )

టీటీడీ వ్యవహారం… ప్రభుత్వ వైఖరి..  YS Jagan`s stand in TTD assets auction issue :
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థుల వేలం విషయంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ ప్రారంభమైంది. ఆస్థుల్ని వేలం వేయడం సమంజసం కాదని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అసలు టీడీపీ ఆస్థుల్ని ప్రభుత్వం వేలం వేయ సంకల్పించిందా లేదా అనేదాని కంటే ... వెనువెంటనే తీసుకున్న నిర్ణయం మాత్రం ఆ నిరసన గొంతుల్ని మూయించేసింది. ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ అంటే భవిష్యత్‌లో సైతం టీటీడీ ఆస్థుల్ని వేలం వేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తూ జీవో విడుదల చేయడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది. 

మొత్తానికి ఏడాది పాలనలో తీసుకున్న నిర్ణయాలు జగన్‌పై కొద్దిగా విమర్శలకు దారితీసినా… ఎక్కువ శాతం సంతృప్తికరంగానే ఉందనే అభిప్రాయం వెలువడుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News