తెలంగాణలో జనసేన సభ్యులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉంది: పవన్ కళ్యాణ్

  

Last Updated : Nov 10, 2018, 02:39 PM IST
తెలంగాణలో జనసేన సభ్యులు.. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉంది: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందా? లేదా? అన్న విషయంపై రెండు, మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే పరిస్థితి వేరేలా ఉండేదని.. అప్పుడు తెలంగాణలో కూడా తప్పకుండా పోటీ చేసేవాళ్లమని పవన్ అన్నారు. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. పోటీ చేయాలా? వద్దా? అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని ఆయన తెలిపారు. కానీ జనసేన తరఫున కొందరు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా తెలంగాణలో నిలబడే అవకాశం ఉందని.. వారికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని పవన్ కోరారు.

అయితే ఈ అన్ని అంశాలపైనా తాను మాట్లాడతానని.. అందుకు రెండు, మూడు రోజులు గడువు ఇవ్వమని ప్రజలను పవన్ కళ్యాణ్ కోరారు. ప్రస్తుతం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో ఢీకొనడానికి మహాకూటమి సభ్యులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలు వివిధ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నాయి. 

ఇటీవలే పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి హెరిటేజ్ బిజినెస్ ఆగిపోతుందని... ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డికి కాంట్రాక్టులు  ఆగిపోతాయని తెలంగాణ అంటే వారికి భయం పట్టుకుందని పవన్ తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిని అందుకే వరంగల్ నుండి తరిమేశారని.. చంద్రబాబుకి కూడా అదే గతి పట్టబోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

అలాగే జనసేన మహాకూటమితో కలిసి తెలంగాణలో పనిచేస్తుందన్న వార్తలపై కూడా పవన్ ఇటీవలే ట్విటర్‌లో వ్యాఖ్యలు చేశారు. ‘‘అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన.. ఆ పార్టీ తో కలుస్తుంది, ఈ పార్టీ తో కలుస్తుందంటూ కొందరు అంటే,  కలవడం ఏంటీ? సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మనకి ఏ పార్టీ అండ దండా అక్కర్లేదు. మన బలం జనం, చూపిద్దాం ప్రభంజనం” అని పవన్ ట్వీట్ చేశారు.

Trending News