రైతన్నకు శుభవార్త.. ఆంధ్రా, తెలంగాణలకు వర్ష సూచన

ఆంధ్రా, తెలంగాణలకు వర్ష సూచన

Last Updated : Aug 11, 2018, 03:55 PM IST
రైతన్నకు శుభవార్త.. ఆంధ్రా, తెలంగాణలకు వర్ష సూచన

ఓవైపు భారీ వర్షాలతో పలు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతోంటే, ఆంధ్రా, తెలంగాణలో మాత్రం రైతన్నలు వర్షం కోసం ఇంకా ఆకాశం వైపు ఎదురుచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. వర్షాభావం కారణంగా పలు ప్రాంతాల్లో ఇంకా వరినాట్లు సైతం వెనుకబడ్డాయంటే అన్నదాతల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, తాజాగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఓ తీపి కబురు అందించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంతోపాటు ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్రలో సముద్రమట్టానికి 5.8 కి.మీఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇదేకాకుండా రానున్న రెండు, మూడు రోజుల్లో వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ ఉపరితల ఆవర్తనాల, అల్పపీడనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీగా వర్షాలు కురిసే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలుచోట్ల ఓ మోస్తరుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. అదేకానీ జరిగితే, విత్తనాలు వేసిన రైతన్నకు కాస్తోకూస్తో మేలు జరిగే అవకాశం ఉంది.
 

Trending News