జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. టీడీపీపై సంచలన ఆరోపణలు!

జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు!

Updated: Dec 1, 2018, 07:37 PM IST
జనసేనలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. టీడీపీపై సంచలన ఆరోపణలు!

హైదరాబాద్: టీడీపీకి, శాసన సభ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం ఉదయం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీపై రావెల కిషోర్ బాబు పలు సంచలన ఆరోపణలు చేశారు, తాను మంత్రిగా ఉన్నప్పుడు నిధులు దారిమళ్లకుండా అర్హులకే పథకాలు అందే విధంగా 24 గంటలు శ్రమించి పనిచేశాను. అయినప్పటికీ తనకు అధికారాలు లేకుండా చేయడం తనను చాలా బాధించింది. చంద్రబాబు నాయుడు గారు తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను. అయితే అదే సమయంలో ఆయన మంత్రి పదవి అయితే ఇచ్చారు కానీ ఆ పదవికి అధికారాలు లేవని తనకు తర్వాత తెలిసిందని రావెల ఆరోపించారు. తనకు గౌరవం దక్కని చోట తాను ఉండలేకపోయాను. దళితులకు పదవులు ఇచ్చిన చంద్రబాబు సర్కార్ వారికి నిజాయితీగా పనిచేసే అధికారాలు మాత్రం ఇవ్వలేదని రావెల ఆవేదన వ్యక్తంచేశారు.

సినీ పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగి, ఎంతో సంపాదించే అవకాశాలు వున్నప్పటికీ, పేదవారికోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ ను స్పూర్తిగా తీసుకుని ఆయనతో కలిసి పనిచేసేందుకే ఇవాళ తాను జనసేన పార్టీలో చేరానని రావెల కిషోర్ బాబు అన్నారు. తాను జనసేన పార్టీలో చేరేందుకు కృషి చేసిన ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌కి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని రావెల కిశోర్ బాబు అభిప్రాయపడ్డారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కూడా ఈ సభలో పాల్గొన్నారు.