Pawan Kalyan About His Arrest: అమరావతి: రాష్ట్రం కోసం జైలు కెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్ఆర్సీపీనీ వీడిన ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు గురువారం మంగళగరిలోని కార్యాలయంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రమేశ్‌బాబుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.
''వాలంటీర్లలో వ్యవస్థలో ఉన్న లోపాలపై, ఆడవారిపై అఘాయిత్యాలు చేస్తోన్న వాలంటీర్లపై, సమాజంలో అవకతవకలకు పాల్పడుతున్న వాలంటీర్ల గురించి మాట్లాడినందుకే తనను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో జారీచేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుపట్టారు. ఒకసారి ఒక మాట చెప్పానంటే అంతకంటే ముందే ఆ మాటతో వచ్చే అన్ని రిస్క్‌ల గురించి ఆలోచించిన తరువాతే ఆ మాట చెబుతానన్న పవన్ కళ్యాణ్... తనను అరెస్టు చేసుకోండి.. జైల్లో చిత్రహింసలు పెట్టుకోండి.. తన మాట మారదు అని స్పష్టంచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని.. అందుకోసం జైలుకెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా తాను సిద్ధంగా ఉన్నా అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మీరు ప్రాసిక్యూషన్ చేస్తాననగానే తానేమీ భయపడనని.. తాను ప్రాసిక్యూషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నా అని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
మీరు పనులను, మీ వైఖరిని కోర్టులు కూడా చూస్తున్నాయి అని గుర్తుచేసిన పవన్ కళ్యాణ్... ఒక్కో వాలంటీరుకు 164 రూపాయలు రోజూవాగీ వేతనంగా ఇస్తున్నారు... డిగ్రీ చదివి ఉన్నత ఉద్యోగాలు చేయాల్సిన వారిని వాలంటీర్లుగా గ్రామానికే పరిమితం చేయడమే కాకుండా ఉపాధి హామీ పథకం కంటే తక్కువ వేతనం ఇవ్వడం ఏంటని ప్రశ్నించడం తప్పా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. హత్యలు చేసిన వాళ్లను ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాం... అవన్నీ పక్కనపెట్టి న్యాయం కోసం మాట్లాడితే, ప్రభుత్వాన్ని నిలదీస్తే నోటీసులు వస్తాయి అని ప్రభుత్వ వైఖరిని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.
తనపై విచారణ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఈ విచారణలో భాగంగా ఏపీ పోలీసులు తనను ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే అలా మాట్లాడినట్టుగా అర్థం అవుతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవేళ తనను పోలీసులు అరెస్ట్ చేసినా.. అదేమీ తనకు షాకింగ్ న్యూస్ కాదని.. అది తాను ముందే ఊహించానని చెప్పే ప్రయత్నంలో భాగంగానే తాను జైలుకి వెళ్లడానికైనా, దెబ్బలు తినడానికైనా సిద్ధమే అనే వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఒకవేళ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసినా.. ఎన్నికలకు ముందు ఆ అంశం కూడా తనకు రాజకీయంగా కలిసొస్తుందనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నారేమేననే టాక్ కూడా వినిపిస్తోంది.