నేడే ఆశారాం తీర్పు.. మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్

ఆధ్యాత్మిక గురువు ఆశారాం అత్యాచార ఆరోపణల కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది.

Last Updated : Apr 25, 2018, 07:25 AM IST
నేడే ఆశారాం తీర్పు..  మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్

ఆధ్యాత్మిక గురువు ఆశారాం అత్యాచార ఆరోపణల కేసులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు బుధవారం తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో జోధ్‌పూర్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు జోధ్‌పూర్‌ ట్రయల్ కోర్టు తన తీర్పును జోధ్‌పూర్‌ సెంట్రల్ జైలు ప్రాంగణలో వెలువరిస్తుంది. తీర్పు సందర్భంగా  ఆశారాం అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జోధ్‌పూర్‌లో నిషేధాజ్ణలు విధించారు. ఈ నెల 30వ తారీఖు వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గత ఆగస్టులో పంచ్‌కులలో మాదిరిగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని కేంద్రం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జోధ్‌పూర్ నగరంలోని రెండు స్టేడియంలను తాత్కాలికంగా జైళ్లుగా మార్చివేశారు.

2013 సంవత్సరం నుంచి జైలు జీవితం గడుపుతున్న స్వయం ప్రకటిత గురువు ఆశారాంపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారామ్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నాటి నుంచి ఇప్పటి వరకు బాధితురాలి కుటుంబానికి హెచ్చరికలు వెలువడుతూనే ఉన్నాయి. బాధిత కుటుంబానికి భద్రత కల్పించి పర్యవేక్షిస్తున్నామని సహరాన్‌పూర్ ఎస్పీ కేబీ సింగ్ తెలిపారు. కాగా, ఈ కేసు తీర్పు కవరేజీకి మీడియాను అనుమతించాలన్న పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు కొట్టేసింది.

Trending News