ఆసుపత్రిలో చేరిన కరుణానిధి.. ఐసీయూలో చికిత్స

డీఎంకే అధినేత ఎం.కరుణానిధి (94) ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది. మూత్రాశయ నాళానికి ఇన్ఫెక్షన్‌, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై ఆసుపత్రికి తరలించారు.

Updated: Jul 28, 2018, 08:59 PM IST
ఆసుపత్రిలో చేరిన కరుణానిధి.. ఐసీయూలో చికిత్స

చెన్నై: డీఎంకే అధినేత ఎం.కరుణానిధి (94) అస్వస్థతకు గురయ్యారు. మూత్రాశయ నాళానికి ఇన్ఫెక్షన్‌, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రక్తపోటు తగ్గడం వల్లే ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం బీపీ, పల్స్ రేట్ సాధారణ స్థాయికి చేరినట్లు వివరించారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరుణానిధి ఆసుపత్రిలో చేరారని వార్తలు వెలువడటంతో రాష్ట్రం నలుమూలల నుంచి వందల మంది కార్యకర్తలు, నాయకులు కావేరీ ఆసుపత్రికి తరలివచ్చారు. ఆయన కోలుకోవాలంటూ, భగవంతుడ్ని ప్రార్థించారు. కాగా.. ఆరోగ్యంపై డీఎంకే కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ పార్టీ నేత ఏ.రాజా కోరారు. కరుణను పరామర్శించడం కోసం శనివారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెన్నైకు వస్తున్నారు.

 

 

 

కరుణానిధి చికిత్సకు అవసరమైన ఏ సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టాలిన్‌కు ప్రధాని మోదీ హామీనిచ్చారని తెలిసింది. కరుణ ఆరోగ్యంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఫోన్‌ చేసి ఆరా చేసినట్లు.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు డీఎంకే వర్గాలు తెలిపాయి.