2012 నాటి అత్యంత హేయమైన నిర్భయ కేసులో తుది అంకానికి సర్వం సిద్ధమవుతోంది. దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్ట్ డెత్ వారెంట్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉరి శిక్ష అమలుపై ఉత్కంఠ తొలగిపోయింది. దీంతో మార్చి 3న ఉదయం 6 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
ఉరి శిక్షను యావజ్జీవఖైదుగా మార్చాలని దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త పెట్టుకున్న అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ధ్వంద్వంగా తోసిపుచ్చింది. దీంతో మార్చి 3న ఉదయం నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారా తీహార్ జైలు అధికారులు.
మరోవైపు పవన్ కుమార్ గుప్త.. ఇప్పటి వరకు రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తు పెట్టుకోలేదు. అతనికి ఈ అవకాశం ఉంది. దోషులు ఇప్పటికే తమకు ఉరి శిక్ష అమలు చేయకుండా చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మార్చి 3న వారికి ఉరి శిక్ష అమలు చేయనున్నారు.