Padmaja Naidu: స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు కూతురు ఎవరో తెలుసా.. 21 ఏళ్లకే అరుదైన గుర్తింపు..!

Padmaja Naidu Death Anniversary: పురుషుల ఆధిపత్య ప్రజా రంగంలో, సామాజిక సేవకురాలిగా, రాజకీయ నాయకురాలిగా, పాలకురాలిగా  ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళ పద్మజా నాయుడు. ఆమె హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంయుక్త వ్యవస్థాపకురాలు. స్వాతంత్య్ర సమర యోధురాలు, కవయిత్రి, సుదీర్ఘ కాలం పాటు గవర్నర్‌గా పని చేసిన మహిళగా నిలిచారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2024, 03:27 PM IST
Padmaja Naidu: స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు కూతురు ఎవరో తెలుసా.. 21 ఏళ్లకే అరుదైన గుర్తింపు..!

Padmaja Naidu Death Anniversary: పద్మజా నాయుడు 1900 నవంబర్ 17న హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తల్లి (బెంగాలీ) ప్రఖ్యాత కవి, భారత స్వాతంత్ర్య సమర యోధురాలు సరోజిని నాయుడు. ఆమె తండ్రి ముత్యాల గోవిందరాజులు నాయుడు (తెలుగు) వైద్యుడు. ఆమెకు జైసూర్య, లీలమణి, ఆదిత్య, రణధీర అనే నలుగురు తోబుట్టువులు. అప్పట్లో పద్మజా నాయుడు పెద్దగా చదువు కోలేదు. మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో నాలుగేళ్లు మాత్రమే చదివారు. బాల్యంలో తరుచుగా అనారోగ్యానికి గురికావడంతో  చదువు కొనసాగించలేకపోయారు. 

Also Read: YS Sharmila: సీఎం జగన్ నవరత్నాలు Vs వైఎస్ షర్మిల నవసందేహాలు.. అన్నపై దూసుకెళ్తున్న బాణం

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వర్క్స్ శాఖను ఏర్పాటు చేసిన పద్మజా నాయుడు.. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఎంతో మంది ముస్లిం స్త్రీలను సభ్యులుగా చేర్చుకున్నారు. ప్లేగు రిలీఫ్ కమిటీని ఏర్పాటు చేశారు. పౌరుల స్వేచ్ఛ కోసం, జాగిర్దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా స్థాపించినన స్వదేశీ లీగ్ అనే సంస్థకు ఆమె అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఆమె తన సంపాదకత్వంలో ‘వన్ వరల్డ్’ అనే పత్రికను నడిపారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సామ్యవాద సిద్ధాంతానికి ప్రభావితులైన కొందరు ఉస్మానియా విద్యార్థులు కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించగా.. ఆ సంస్థకు పద్మజా నాయుడు సహకారం అందించారు. 1935లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సమయంలో రైతుల దుర్భర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి ఏర్పడిన హైదరాబాద్ సహాయక సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా వ్యవహరించారు. అనేక ప్రాంతాలు పర్యటించి, బాధితులకు తక్షణ సహాయం అందేలా చూశారు.

1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పద్మజా నాయుడు జైలుకు వెళ్లారు. అప్పట్లో మహిళలకు ప్రత్యేక జైళ్లు ఉండేవి కావు. ఆమె పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వారు కావడంతో.. హయత్ నగర్‌లోని బేగంగారి దేవిడిలో ఉన్న రాజభవనంలో  నిర్బంధించారు. అయితే తనతో పాటు ఉన్న మహిళలకు కూడా ఆ వసతులు కల్పించలేదని ప్రశ్నించారు. చైనాతో వార్ సమయంలో ఆమె తన వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలను నేషనల్ డిఫెన్స్ ఫౌండేషన్‌కు విరాళం అందజేశారు. ఖాదీ గురించి గాంధీ సందేశాన్ని విస్తృతంగా  వ్యాప్తి చేసేందుకు, విదేశీ వస్తువులను బహిష్కరించేందుకు ఆమె  కృషి చేశారు. 1950లో రాజ్యసభకు ఎన్నికై.. రెండేళ్లు ఆ పదవిలో కొనసాగారు. 1956 నుంచి 1967 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా బాధ్యతలు నిర్వర్తించారు.
 
స్వాతంత్య్ర ఉద్యమంలో తల్లి సరోజి నాయుడితో పాటు చురుగ్గా పనిచేసిన పద్మజ.. 21 ఏళ్ల వయసులోనే హైదరాబాద్‌లో భారత జాతీయ కాంగ్రెస్  సహ వ్యవస్థాపకురాలు అయ్యారు. బంగ్లాదేశ్ శరణార్ధుల సహాయ చర్యలప్పుడు భారత రెడ్ క్రాస్ సంస్థ ఛైర్ పర్సన్‌గా పని చేశారు. పద్మజా నాయుడుకు భారత్ సేవక్ సమాజ్, అఖిల భారత హస్తకళల బోర్డు, నెహ్రూ స్మారక నిధి వంటి సంస్థలతో అనుబంధం ఉండేది. పద్మజ తన కవితా సంకలనం “ది ఫెదర్ ఆఫ్ డాన్” పేరుతో 1961లో ప్రచురించారు. 1975లో పద్మజా నాయుడు స్మృత్యర్ధం డార్జిలింగులోని జంతు ప్రదర్శన శాలను పద్మజా నాయుడు హిమాలయ జంతు ప్రదర్శన శాలగా మార్చారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. పద్మజా నాయుడు తన తల్లి సరోజిని నాయుడు నివాసం ది గోల్డెన్ థ్రెషోల్డ్‌ను 1970లో హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. ఆమె దేశానకి విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. పద్మజా నాయుడు 1975 మే 2న స్వర్గస్థులయ్యారు.

రామ కిష్టయ్య సంగన భట్ల 
     9440595494

Also Read: Kadiyam Kavya - Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News