సుంజ్వాన్ ఉగ్ర దాడి : ఇద్దరు టెర్రరిస్టులని మట్టుపెట్టిన ఇండియన్ ఆర్మీ

ఇద్దరు టెర్రరిస్టులని మట్టుపెట్టిన ఇండియన్ ఆర్మీ.. తప్పించుకున్న మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు

Last Updated : Feb 11, 2018, 03:23 PM IST
సుంజ్వాన్ ఉగ్ర దాడి : ఇద్దరు టెర్రరిస్టులని మట్టుపెట్టిన ఇండియన్ ఆర్మీ

జమ్మూ కాశ్మీర్‌లోని సుంజ్వాన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఆర్మి క్యాంపుపై ఆకస్మిక దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఇద్దరు భద్రతా సిబ్బందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడిన మరో తొమ్మిది మందిలో ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా వుంది. ఈ దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులు తలదాచుకున్న నివాస భవనాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులని హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల వద్ద ఏకే 56 తుపాకులు, ఇతర మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద లభించిన ఆధారాల ప్రకారం ఆ ఇద్దరూ పాకిస్థాన్‌కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా ఇండియన్ ఆర్మీ వర్గాలు గుర్తించాయి. 

 

ఉగ్రవాదులు తలదాచుకున్న భవనంలోని పౌరులని ఖాళీ చేయించిన ఇండియన్ ఆర్మీ.. వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. భద్రతావర్గాలు ఆ భవనంలోని ప్రతీ గదిని జల్లెడ పడుతున్నాయని, తప్పించుకున్న మిగతా ఉగ్రవాదులని మట్టుపెట్టే వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని సదరు అధికారి పేర్కొన్నారు. 

 

ఉగ్రవాదుల దాడిలో అమరులైన ఇద్దరు భద్రతాధికారులని జమ్ముకాశ్మీర్‌కి చెందినవారేనని ఇండియన్ ఆర్మీ స్పష్టంచేసింది. జమ్మూకాశ్మీర్‌లో సుంజ్వాన్ దాడి నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ఓ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్ర డీజీపీ ఎప్సీ వేద్ సహా ఇతర భద్రతా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Trending News