Rahul Gandhi: రాహుల్ గాంధీకి భారీ ఊరట.. జైలు శిక్షపై సుప్రీం స్టే

Supreme Court on Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో లైన్ క్లియర్ అయింది. గుజరాత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. దీంతో రాహుల్ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ కానుంది.

Written by - Ashok Krindinti | Last Updated : Aug 4, 2023, 02:50 PM IST
Rahul Gandhi: రాహుల్ గాంధీకి భారీ ఊరట.. జైలు శిక్షపై సుప్రీం స్టే

Supreme Court on Rahul Gandhi Defamation Case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ట శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించలేదని అభిప్రాయపడింది. దొంగలందరికీ మోదీ ఇంటి పేరు ఎలా వచ్చింది..? అంటూ 2019లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు అయింది. ఈ కేసు విచారించిన కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం గుజరాత్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. దీంతో సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. ధర్మాసనం శుక్రవారం స్టే విధించింది.

జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించగా.. రాహుల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. సూరత్‌లోని సెషన్స్ కోర్టులో 2019 పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం తప్పు అని అన్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా అనర్హత వేటు వేసే విధంగా శిక్ష విధించిందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారు (పూర్ణేష్) అసలు ఇంటిపేరు మోదీ కాదని కోర్టుకు చెప్పారు.

ఆయన అసలు ఇంటిపేరు భూతాల అని.. అలాంటప్పుడు ఇది ఎలా పరువు నష్టం కేసు అవుతుందన్నారు. రాహుల్ పేర్కొన్న వ్యక్తులు కేసు పెట్టలేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. మోదీ అనే పేరుతో 13 కోట్ల మంది ఉన్నారని ఫిర్యాదుదారులు అంటున్నారని.. అయితే జాగ్రత్తగా చూస్తే బీజేపీతో ముడిపడిన వ్యక్తులకే ఈ సమస్య వస్తోందన్నారు.

ఈ కేసులో రాహుల్ గాంధీకి కావాలనే గరిష్టంగా శిక్ష విధించారని వాదించారు. దీంతో రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడిందని.. హైకోర్టు తీర్పును 66 రోజుల పాటు రిజర్వ్‌లో ఉంచిందని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే లోక్‌సభ రెండు సమావేశాలకు రాహుల్ హాజరు కాలేకపోయారని చెప్పారు. జస్టిస్ గవాయ్ తీర్పును వెల్లడిస్తూ.. రాహుల్ గాంధీకి గరిష్ట శిక్షను విధించడానకి కారణం కూడా వివరంగా పేర్కొనలేదన్నారు. ఇలాంటి శిక్ష విధించడం వల్ల ఒకరికే కాకుండా.. మొత్తం నియోజకవర్గం హక్కును దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పుతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్దరణ కానుంది.
 

Trending News