YS Sharmila strong counter to KCR and KTR: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అమర వీరులు చేసిన త్యాగాన్ని కల్వకుంట్ల వారి కుటుంబం తమ భోగంగా మల్చుకుంది అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ కాదని.. అది బందిపోట్ల రాష్ట్ర సమితికి "దోపిడీ మిషన్ " అని ఎద్దేవా చేశారు. సిద్ధిపేట సభలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఉద్దేశించి వైఎస్ షర్మిల మాట్లాడుతూ, " వీళ్లు పుట్టకపోతే తెలంగాణనే లేదట.. వీళ్లు దీక్ష చేయకుంటే తెలంగాణ రాష్ట్రమే రాకుండెనట. ఉద్యమంలో ఉన్నదంతా వీళ్లేనట.. కొట్లాడింది వీళ్లేనట.. తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంతేకాకుండా ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే అని ఘాటైన పదజాలంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
1200 మంది అమరుల త్యాగాలపై రాజభోగాలు అనుభవిస్తూ.. రాష్ట్ర సంపదను పందికొక్కుల లెక్క దోచుకుతింటున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యమం కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులను, సకల జనులను అవమానించడమే మీ సంస్కారమా ? చావు నోట్లో తలకాయ పెట్టి, బయటకు వచ్చింది ఎందరో అయితే.. చావును ముద్దాడి రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించింది మరెందరో.. దొంగ దీక్షలతోనో, అమెరికాలో ఉన్న నీ బిడ్డలు ఊడిపడితేనో.. లేక పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె దొరకలేదని నాటకాలు ఆడితేనో తెలంగాణ రాలేదు అని షర్మిల మండిపడ్డారు.
మూడు తరాల నాయకులు ముక్త కంఠంతో ఉద్యమిస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. సకల జనులు వారి జీవితాలను, ప్రాణాలను, ఆస్తులను త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఉద్యమ నినాదంతో సీఎం పీఠం ఎక్కి.. అమరవీరుల అడ్రస్సులు, త్యాగధనుల పేర్లు నామరూపాలు లేకుండా చేసి తమతోనే రాష్ట్రం వచ్చిందని.. అయ్యా, కొడుకులు ఇద్దరూ పచ్చి అబద్ధాలు చెప్పుకుంటున్నారు అని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ చరిత్రను, త్యాగాలను కనుమరుగు చేసే కుట్ర జరుగుతోంది. స్వరాష్ట్రంలో అమరులకు గుర్తింపు లేదు. వస్తాయనుకున్న ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగులకు జీతాలు లేవు. కార్మికులకు హక్కులు లేవు. ప్రశ్నించే హక్కును రద్దు చేసి కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.
"అమరవీరుల త్యాగం - కల్వకుంట్ల వారి భోగం”
వీళ్లు పుట్టకపోతే తెలంగాణ లేదట! దీక్ష చేయకుంటే రాష్ట్రమే రాకుండెనట. ఉద్యమంలో వీళ్లేనట, కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది దొర ఒక్కడేనట!ఉద్యమాల తెలంగాణ చరిత్రను వక్రీకరించడానికి అయ్యా కొడుకులకు సిగ్గుండాలే.. 1200 మంది అమరుల త్యాగాలపై రాజ…
— YS Sharmila (@realyssharmila) June 16, 2023
"బాంచన్ దొర.. నీ కాళ్లు మొక్కుత" అంటే కానీ బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. ఉద్యమ ఆకాంక్షలను పక్కన పెట్టి.. తెలంగాణ పదాన్ని పార్టీ నుంచే తుడిపేసి.. జై తెలంగాణ అంటే.. నై తెలంగాణ అని చెప్తున్న పెద్ద తెలంగాణ ద్రోహి కేసీఆర్. తనది పార్టీ కాదని మిషన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన షర్మిల.. అవును, మీది పార్టీ అని ఎవరన్నారు ? అది బందిపోట్ల రాష్ట్ర సమితికి "దోపిడీ మిషన్" అని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం.. దోచుకున్నది దాచుకోవడమే మీ పార్టీ మిషన్ అని సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌పై సైతం విమర్శనాస్త్రాలు సంధించారు.
YS Sharmila: కేసీఆర్, కేటీఆర్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు