Pawan Kalyan Visits Yetimoga oF Kakinada: మీకు బతికే హక్కు, సంపాదించే హక్కు ఉంది.. ఉపాధిని దెబ్బతీస్తే వారి మీద పోరాటం చేసే హక్కు.. ఇలా అన్ని హక్కులు ఉన్నాయి. మీ పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎన్నికల ప్రక్రియలో భాగం మాత్రమేనని, ప్రజా సమస్యల కోసం నిలబడడమే రాజకీయ పార్టీగా జనసేన నిలిచిపోతుందన్నారు. వ్యవసాయంతో పాటుగా మత్స్య సంపదను సేకరించే మత్స్యకారులను సమంగా చూస్తామన్నారు. సోమవారం సాయంత్రం కాకినాడ నగర నియోజకవర్గ పరిధిలోని ఏటిమొగ ప్రాంతంలో జరిగిన మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "మత్స్యకార సోదరులు అందరికీ ఓ బాధ్యత గల రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా నా కమిట్‌మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. 2009లో తెలంగాణలోని ఓ గిరిజన తండాలో తాగునీటి కోసం ఓ అంధ వృద్దురాలు కన్నీరు పెట్టుకుంటే, ఆ రోజు ఆ తాగునీటి సమస్యను తీర్చేందుకు అధికారం వస్తేనే చేయాలని భావించలేదు. వెంటనే సొంత డబ్బుతో స్నేహితులను పంపి బోరు వేయించాను. పదవి కోసం అయితే నేను ఇంత తపన పడనవసరం లేదు. ఇంత మందితో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న 976 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అంటిపెట్టుకుని వందలాది మత్స్యకార గ్రామాల్లో మత్స్యకారులు వేటే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతం ఓఎన్జీసీతో పాటు మరికొన్ని కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు విధ్వంసమూ కనబడుతోంది. తీర ప్రాంతానికి ఎలాంటి హాని జరిగినా మత్స్యకారులు మొత్తం నలిగిపోతారు. గంగవరం పోర్టు కావచ్చు.. తొండంగి మండలంలో ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమలు కావచ్చు. అవి మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి.
ప్రస్తుత ముఖ్యమంత్రిలా నేను అద్భుతాలు చేస్తానని చెప్పను. బటన్ నొక్కితే డబ్బు పడుతుందని చెప్పను. ప్రతి సమస్య పరిష్కారానికి త్రికరణ శుద్దిగా జనసేన పాటుపడుతుంది. దివీస్ బాధితులకు మద్దతుగా నేను తొండంగి వెళ్తే కొన్ని రోజులు ఆగారు. అక్కడ మత్స్యకారులే గ్రూపులుగా చీలిపోయారు. మత్స్య సంపద పోతే అంతా పోతాం కాబట్టి మొదట మన మధ్య ఐక్యత అవసరం. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ వల్ల మత్స్య సంపదకు నష్టం జరుగుతుంది. దివీస్ పరిశ్రమ వెదజల్లే వ్యర్ధాల వల్లా నాశనం అవుతుంది.
అధికారంలోకి వస్తే దివీస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తాం అని చెప్పిన పెద్దమనిషి అధికారంలోకి వచ్చాక అక్కడే మరో రసాయన పరిశ్రమను తీసుకొచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. అభివృద్ధికి జనసేన వ్యతిరేకం కాదు.. దివీస్ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలు ఎవరికీ హాని కలిగించకుండా, పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేలా మా ఆలోచనలు ఉంటాయి. పరిశ్రమలు మూసేస్తాం అని చెప్పం. కానీ ఆ పరిశ్రమల వల్ల ప్రభావితం అయ్యే వారి జీవితాలకు ఏ మాత్రం ఆటంకం కలగకుండా చూసే బాధ్యతను మేం తీసుకుంటాం. ఈ వ్యవహారంలో మీరు సరైన వ్యక్తుల్ని నమ్మడం లేదు. కల్లబొల్లి మాటలు నమ్మే స్థితి నుంచి బయటకు రావాలి. జనసేన పార్టీ పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతం మీద ముందుకు వెళ్తుంది. మీ విశ్వాసం, నమ్మకం సరైన వ్యక్తుల మీద పెట్టండి. మీ కోసం అవసరం అయితే ఢిల్లీ వెళ్లి ప్రధాని శ్రీ మోదీ గారికి మీ సమస్యను విన్నవిస్తా. పదేళ్లుగా నన్ను చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని నమ్మండి.
మత్స్యకార బోటు నుంచి దూకి ఈదుతుంటే ఒలింపిక్స్‌లో పోటీ చేసే సత్తా వారికి ఉందనిపించింది. ఆ తెగింపుకి సరైన దారి చూపాలి. 20 ఏళ్ల క్రితం ఓ బోటు ఓనర్‌గా ఉన్న వ్యక్తి ఆటో డ్రైవర్‌గా మారారని చెప్పడం వేదన కలిగించింది. ఇష్టమైన పని వదిలి ఆటో నడుపుకుంటూ నలిగిపోతుంటే నా మనసు చలించింది. తిరిగి మీ బోట్లు మీకు ఇప్పించాలన్న లక్ష్యమే పది లక్షలు సాయం ఇస్తామన్న పథకం. బోట్లు కొనుక్కునేందుకు పెట్టుబడి మేము పెడతాం.
19వ శతాబ్దంలో రంగూన్ వెళ్లి లక్షాధికారి అయిన మల్లాడి సత్యలింగం నాయకర్ చేసిన దానాలు ఎవరూ మరువలేనివి. ప్రపంచానికి టెట్రాసైక్లిన్ అందించిన శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు హార్వర్డ్ యూనివర్శిటీలో చదవడానికి ఎంఎస్ఎన్ చారిటీస్ ద్వారా రూ.1500 ఉపకార వేతనం ఇచ్చారు. మల్లాడి సత్యలింగం నాయకర్ వారసులు మీరంతా. సంపద ఆ నలుగురు దగ్గరే పైరవీలు, భూకబ్జాలతో డబ్బు మొత్తం ఒకరి వద్ద పేరుకుపోతోంది.
పెద్దిరెడ్డి మూడు కంపెనీలకు తీర ప్రాంత సంపద మొత్తం తరలిపోతోంది. ఒక్క ఇసుక మీదే రూ. 10 వేల కోట్లు దోచేస్తున్నారు. డబ్బు మొత్తం ఒక కులానికి వెళ్లిపోతోంది. ఆర్థిక వృద్ధికి డబ్బు రీసైకిల్ అనేది చాలా అవసరం. ఎక్కువ మంది దగ్గర డబ్బులు ఉంటే అది మరింత మందికి చేరుతుంది. వైసీపీ విధానాలతో ముగ్గురు, నలుగురు వ్యక్తుల వద్దనే సంపద ఉండిపోతోంది. వారు విదిలించే సొమ్ములనే మనం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఇది సమాజ ఆర్థిక వృద్ధిని చిన్నాభిన్నం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు.
నాకేమీ కాంట్రాక్టులు లేవు.. వ్యాపారాలు లేవు... మీ సమస్యలు ఏవైనా వాటికో శాశ్వత పరిష్కారం చేపేందుకు నా చర్యలుంటాయి అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మీ కోసం తీర ప్రాంతంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యంతో మాట్లాడుతా. ఎవరితోనూ ములాఖత్ అయ్యేందుకు నాకేమీ కాంట్రాక్టులు లేవు. వ్యాపారాలు లేవు. వైసీపీ నాయకులు సమస్య గురించి మాట్లాడటానికి వెళ్లి వారితో పైరవీలు ద్వారా సెటిల్‌మెంట్లు చేసుకునే బాపతు నేను కాదు. నాకు డబ్బు మీద ఆశ లేదు. డబ్బుపై ఆశ ఏర్పడితే పోరాడే గుణం పోతుందని బలంగా నమ్మే వాడిని. తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల జీవితాల అతలాకుతలం అయిపోతున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి మీరు నలిగిపోకూడదు. 40 గజాల స్థలంలో ఇల్లు ఎలా వస్తుంది...? మీకు పరిశుభ్రమైన వాతావరణంలో జీవనం ఉండాలనేది నా అభిలాష. క్లాస్ వార్ అని చెప్పే ముఖ్యమంత్రి పేదల పక్షాన నిలబడడం లేదు. వాళ్లు దోచేసే ఇసుక బీసీ కులాల దగ్గర డబ్బు చాలా ఉండేది. కష్టపడే వారి దగ్గర పెట్టుబడి లేదు.
ఇలాంటి సమస్యలపై పోరాడేందుకు మేము మీకు అండగా నిలబడాలంటే మీరు మా వెంట ఉండండి. మీ సమస్యకు పరిష్కారం మీ ఓట్లతోనే నిలదీయండి. నా అఖరి శ్వాస వరకు ప్రతి మత్స్యకారుడికి అండగా ఉంటాను. ఏటిమొగ స్మార్ట్ సిటీ కావాలని కోరుకుంటున్నా. జెట్టీలు, పడవలు ఇక్కడే అందుబాటులో ఉండాలి. మీరు బతుకుదెరువు కోసం గుజరాత్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా పరిస్థితులు కల్పిస్తాం" అని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి : Pawan Kalyan About Life Threat: నాకు ప్రాణహాని ఉంది.. సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారు
పవన్ కళ్యాణ్ కోసం ఏరులోకి దూకిన యువత
ఏటిమొగ పర్యటన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ అంతకు ముందు ఏటిమొగ ఏరులో బోటుపై ప్రయాణించారు. ఆయన్ని దగ్గర నుంచి చూసేందుకు కలిసేందుకు మత్స్యకార యువత పోటీ పడ్డారు. హనుమాన్ పేరుతో వెళ్తున్న పెద్ద బోటులో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తుండగా ఆయన్ని చేరుకునేందుకు మత్స్యకార యువత ఏరులో దూకి ఈదుకుంటూ మరీ పవన్ కళ్యాణ్ బోటు పైకి ఎక్కారు. మత్స్యకార యువతను నిరాశపర్చకుండా వారికి దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. వారితో కరచాలనం చేసి, ఫోటోలు దిగి పంపారు. ఏటిమొగ పరిసర ప్రాంతాల నుంచి మత్స్యకార మహిళలు సైతం పడవల్లో పవన్ కళ్యాణ్‌ని అనుసరించడం విశేషం. ఆయన ఆశీర్వాదం కోసం ఏకంగా మత్స్యకార గ్రామాల్లోని బాలింత మహిళలు సైతం నెల రోజుల బిడ్డల్ని తీసుకుని సొంత పడవల్లో ఆయన్ని చేరుకునేందుకు దగ్గరకు రావడం అందర్నీ అబ్బురపరచింది. సుమారు గంటసేపు ఉప్పుటేరులో ప్రయాణించిన జనసేనానికి మత్స్యకార యువత ఊపిరాడనివ్వకుండా చేశారు. అభిమాన కడలి చుట్టుముట్టడంతో పవన్ కళ్యాణ్ ఆనందపరవశులయ్యారు. బోటు ప్రయాణం ద్వారా తీర ప్రాంత మత్య్సకార గ్రామాల్లో పరిస్థితులు స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ బొమ్మిడి నాయకర్, పార్టీ నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, షేక్ రియాజ్, సంగిసెట్టి అశోక్, తలాటం సత్య, వాసిరెడ్డి శివ ప్రసాద్, వై.శ్రీనివాస్, మండలి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Pawan Kalyan's Challenges To YSRCP: గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో ఒక్కటి కూడా వైసీపీకి దక్కొద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK