2019 ప్రపంచ కప్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగే నిర్ణయాన్ని ప్రకటిస్తానని భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. 'అందరిలాగే నేను కూడా ఎదో ఒక రోజు తప్పుకోవాల్సిందే. నాకు సాధ్యమైనన్ని రోజులు క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తాను. రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్‌కు నా సేవలు అందిస్తున్నాను. నా భవిష్యత్తును ఇప్పటికే నిర్ణయించుకున్నా. ప్రపంచ కప్ తరువాత నా నిర్ణయాన్ని వెల్లడిస్తా' అని పేర్కొన్నారు.
గతేడాది 2017 జూన్‌లో టీమిండియా తరఫున చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన యువీ.. తర్వాత ఫామ్ లో లేడు. 2000 సంవత్సరం నుంచి యువీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అదే ఏడాది అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత యువీతోపాటు మహ్మద్ కైఫ్ కూడా సీనియర్ టీమ్‌కు ఎంపికయ్యారు. ఇక ఐపీఎల్ పంజాబ్ టీమ్ గురించి మాట్లాడుతూ, సెమీఫైనల్ చేరడమే తమ లక్ష్యమని చెప్పాడు. టాప్ ఫామ్‌లో ఉన్న క్రిస్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఈ ఏడాది చెన్నై, కోల్‌కతా టీమ్‌లు తమ ప్రధాన ప్రత్యర్థులని అన్నారు.