గతేడాదే టీడీపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి.. ఎప్పటికైనా సీఎం సీటే తన లక్ష్యం అని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి ఇప్పుడు కాకపోయినా.. ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రి అయి తీరుతానని ధీమా వ్యక్తంచేసిన రేవంత్ రెడ్డి.. తాను చెబితే వినేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో చాలామందే వున్నారని అన్నారు. అంతేకాకుండా శాసన సభ నుంచి వేటుకు గురైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సూచనల మేరకే దీక్ష చేశారని తెలిపారు. టీపీసీసీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ తన సేవలను సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఒకింత అసహనానికి గురయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వర్కింగ్ ప్రెసిండెంట్ పదవి ఇచ్చినా తాను వద్దని చెప్పానన్న రేవంత్.. తనను పార్టీలో చేర్చుకునేటప్పుడు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరపున వచ్చిన దూతలు చాలా హామీలు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు. రాహుల్ గాంధీ తరపు దూతలు ఏం హామీలు ఇచ్చారనేది కేవలం వారికి, తనకు మాత్రమే తెలుసునంటూ రేవంత్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన స్థాయికి తగిన పదవి ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
పార్టీలో చేరిన కొద్దికాలానికే పార్టీ తీరుపై, పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనియాంశమయ్యాయి. సీఎం సీటుపై ఆశలు పెంచుకున్న సీనియర్ నేతలు ఎంతోమంది వున్న కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి కూడా సీఏం పదవే తన లక్ష్యం అని కుండబద్ధలు కొట్టడం, రాహుల్ గాంధీ దూతలు పలు హామీలు ఇచ్చారని చెప్పడం పార్టీ సీనియర్ నేతలను ఆలోచనలో పడేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.