Hyderabad Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నాం ఎండ దంచి కొడుతోంది. సాయంత్రానికి సీన్ మారిపోతోంది. కుండపోతగా వర్షం కురుస్తోంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపించాడు. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. హైదరాబాద్ లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. ఉరుము ఉరిమింది.. మేఘం గర్జించింది. వెంటనే వరుణుడి బ్యాటింగ్ మొదలైంది. టూ ఓవర్స్ మ్యాచ్ ఆడేశాడు వరుణుడు. క్లౌడ్ బరస్ట్ అయిందన్నట్లుగా కుమ్మేశాడు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. కేవలం రెండు గంటల్లోనే ఏకంగా 10 సెంటిమీటర్ల వర్షం కురిసింది. సాయంత్రం మొదలైన వాన.. రాత్రి వరకు కొనసాగింంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోని గచ్చిబౌలిలో అత్యధికంగా 119 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. మెహిదిపట్నం 114, ఖైరతాబాద్ 105, నాంపల్లి 105, గన్ ఫౌండ్రీ , అత్తాపూర్ 88, అల్కాపురి 80లో మిల్లిమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ మెయిన్ సిటీలో కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరవాసులు మరోసారి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమని గడిపారు. వాహనదారుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. మూడు, నాలుగు గంటల పాటు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కుండపోత వర్షం కురవడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. కొందరు ఉద్యోగులు రాత్రి 10 వరకు ఇంటికి చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు.
హైదరబాద్ శివారు ప్రాంతాలతో పాటు యాదాద్రి భువనగిరి, నల్గొండ, ఖమ్మం, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో మూడు గంటల్లోనే 171 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం 133, పొంకల్ 126, జగిత్యా ల జిల్లా మన్నెగూడెం 106, నల్గొండ జిల్లా ఉరుముడ్ల 105 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. సోమవారం కురిసిన వర్షం ట్రైలర్ మాత్రమేనని చెబుతోంది వాతావరణ శాఖ. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కుండపోతగా వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులతో ఆకస్మాత్తుగా గంట్లలోనే 10 సెంటిమీటర్ల వర్షం నమోదవుతుందని వెల్లడించింది. హైదరాబాద్ లో ఈ తరహా వర్షాలకు ఎక్కువ అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ.. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Read Also: Seshanna : ఆరున్నర ఏళ్ల తర్వాత దొరికిన నరహంతకుడు.. నయీం ప్రధాన అనుచరుడు శేషన్నఅరెస్ట్
Read Also: Mars Transit 2022: వచ్చే నెలలో కుజుడి స్థానంలో పెను మార్పులు.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి