సీఎం వైఎస్ జగన్‌కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి

సీఎం వైఎస్ జగన్‌కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి

Updated: Oct 15, 2019, 10:37 PM IST
సీఎం వైఎస్ జగన్‌కి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తన మద్దతు ప్రకటించారు. ఇబ్రహీంపట్నం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించిన కోమటిరెడ్డి.. ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని, ధైర్యంగా పోరాడి సాధించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పటికైనా కేసీఆర్ దిగిరాక తప్పదు.. మీ డిమాండ్లను పరిష్కరించక తప్పదని కార్మికులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టిన కోమటిరెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఏమైనా అంటే కాంగ్రెస్, బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేశారా అని ప్రశ్నిస్తున్న కేసీఆర్‌కు పక్క రాష్ట్రంలో చిన్నవాడైన జగన్ విలీనం చేయడం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. వయస్సులో చిన్నోడైన జగన్‌ని చూసైనా బుద్ది తెచ్చుకోవాలని కోమటిరెడ్డి హితవు పలికారు. ఏపీలో లోటు బడ్జెట్ ఇబ్బందులను లెక్క చేయకుండా జగన్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేశారని.. మరి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో అదెందుకు సాధ్యపడటం లేదని కోమటిరెడ్డి నిలదీశారు.

కేసీఆర్‌పై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డ కోమటిరెడ్డి.. పదేళ్ల క్రితం చనిపోయిన వైఎస్సార్ తన కీర్తితో కొడుకును సీఎంగా గెలిపించుకుంటే, బతికున్న కేసీఆర్... రూ.500 కోట్లు ఖర్చుపెట్టి కూడా బిడ్డను ఎంపీగా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవాచేశారు. వైఎస్సార్‌కి తెలంగాణలోనూ అభిమానులున్నారని చెబుతూ.. కేసీఆర్ లాంటి నేతలతో దోస్తి చేసి మీకున్న మంచిపేరును చెడగొట్టుకోవద్దని వైఎస్ జగన్‌కి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు సైతం మద్దతు పలకాల్సిందిగా జగన్‌ను కోరుతున్నట్టు కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.